Wednesday, 4 November 2026

అధికారిక లాంఛనాలతో..  అనంత్‌కుమార్‌ అంత్యక్రియలు

– అంత్యక్రియల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు
బెంగళూరు, నవంబర్‌13(జ‌నంసాక్షి) : ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ అంత్యక్రియలు అధికారిక లాంఛనాల మధ్య మంగళవారం పూర్తయ్యాయి. కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, పియూష్‌ గోయల్‌, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, కర్ణాటక భాజపా నేతలు అంత్యక్రియలకు హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు. మంగళవారం ఉదయం అనంత్‌కుమార్‌ భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి భాజపా పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనంత్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం నేషనల్‌ కళాశాల మైదానానికి తరలించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర చేపట్టి చామరాజపేట్‌ శ్మశానవాటికలో అనంత్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధపడుతున్న అనంత్‌ కుమార్‌ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. లండన్‌, న్యూయార్క్‌ వైద్యాలయాల్లో చికిత్స అనంతరం బెంగళూరుకు వచ్చిన ఆయన 20 రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనంత్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పలువులు కేంద్రమంత్రులు, రాష్టాల్ర ముఖ్యమంత్రులు దిగ్భాంత్రి వ్యక్తంచేశారు. బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ సోమవారం రాత్రి ప్రధాని మోదీ బెంగళూరు వెళ్లి అనంత్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు.