అధికారుల నిఘా ఉన్నా ఆగని కలపరావాణా

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌లో రోజురోజూకూ కలప స్మగ్లింగ్‌ పెరిగిపోతోంది. అక్రమ రావాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అడవులను కాపాడుకుంటామని జిల్లాకు చెందిన అటవీశాఖ మంత్రి జోగురామన్న చెబుతున్నా కార్యాచరణలో మాత్రం కానరావడం లేదు.  ఇచ్చోడ సవిూపంలోని ముల్తానీలు ఎక్కువగా ఈ తతంగానికి పాల్పడుతున్నారున్న ఆరోపణలు ఉన్నాయి. పటిష్ట చర్యలు లేని కారణంగా విలువైన అడవులను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. కలపను జిల్లా దాటించేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. కొత్తకార్లు, అంబులెన్స్‌, ఆటోలు, వ్యాన్‌లు.. ఇలా వాహనం ఏదైనా కలపను తరలించడానికి తమకు అనువుగా మార్చుకుంటున్నారు స్మగ్లర్లు. బైపాస్‌ రహదారి విస్తరణ అనంతరం వీరి పని మరింత సులభమైంది. ఇచ్చోడ, ఆదిలాబాద్‌ ప్రాంతాల నుంచి సేకరించిన కలపను మహబూబ్‌ఘాట్‌ నుంచి సారంగాపూర్‌, నిర్మల్‌ మార్గాల్లో అందుబాటులో ఉన్న మార్గాల్లో వీరు కలపను తరలిస్తున్నారు. కొన్నిసార్లు ఎవరికీ అనుమానం రాకుండా నేరుగా జాతీయరహదారిపై నుంచి సైతం వెళ్తున్నారు. నేరడిగొండ, మామడ, లక్ష్మణచాంద మండలాల పరిధిలో సేకరించిన కలపను గ్రామాల్లో ఉన్న చిన్నచిన్న రోడ్లవిూదుగా నిజామాబాద్‌ జిల్లాకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం గోదావరి నదిని సైతం తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రేవుదాటితే సులభంగా బయటపడేందుకు అవకాశం ఉండటంతో సైకిళ్లు, ఎడ్లబండ్లు, ద్విచక్రవాహనాలపై రేవు వరకు దుంగలను తీసుకెళ్లటం, అక్కడినుంచి నీటిద్వారా అవతలి ఒడ్డుకు చేరవేయడం చేస్తున్నారు. చాలాచోట్ల అటవీశాఖ తనిఖీకేంద్రాలు లేకపోవడంతో వాహనాలు సులభంగా బయటపడ్తున్నాయి. వాహనాలను అటకాయించి,  భయభ్రాంతులకు గురిచేయడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలతో కలప తరలింపునకు పాల్పడుతున్నారు. వాహనంలో కలపను నింపిన అనంతరం ముల్తానీలు అదే వాహనంలో కాకుండా ద్విచక్రవాహనం, లేదా మరో వాహనంలో ఆ వాహనాన్ని వెంబడించేవారు. ఎక్కడైనా అటవీఅధికారులకు ఈ వాహనం పట్టుబడ్డా తాము సులువుగా తప్పించుకోవడానికి ఇలా చేసేవారు. ఎవరికీ పట్టుబడకుండా వాహనాన్ని జిల్లా దాటించి సొమ్ము చేసుకుంటున్నారు.  దాన్ని తాము కోరుకున్న చోటకు చేరవేసి డబ్బులు సంపాదిస్తుంటారు. కేవలం ముల్తానీలే కాకుండా కొంతమంది స్మగ్లర్లు సైతం కలప తరలింపును తమ ఉపాధిగా మల్చుకున్నారు. తక్కువధరలో కారు, వ్యాన్‌లాంటి ఏదైనా వాహనాన్ని కొనుగోలుచేసి అందులో కలపను తరలిస్తున్నారు. వాహనం పట్టుబడ్డా తక్కువ మొత్తంలో నష్టపోవచ్చని, ఒకటి, రెండుసార్లు కలపను తరలిస్తే తాము పెట్టిన పెట్టుబడులు వచ్చేస్తాయన్న నమ్మకంతో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. పెరుగుతున్న తనిఖీలు, నిఘాతో దాదాపు అన్ని వాహనాల్లోనూ కలపను తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దినెలల క్రితం బాసర సవిూపంలో వేగంగా వెళ్తున్న ఓ అంబులెన్స్‌ వాహనంపై అటవీశాఖ అధికారులకు అనుమానం రావటంతో ఆపి తనిఖీచేయగా అందులో కలపదుంగలు లభించాయి. టాటాసుమో వాహనంలో కలపదుంగలను తరలిస్తూ అధికారులకు చిక్కారు. అప్పుడే తీసుకొస్తున్న ఓ నానో కారులోనూ కలపదుంగలను ఉంచి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులకు పట్టుబడింది. ఖానాపూర్‌ మార్గం నుంచి నిర్మల్‌ వైపునకు కొంతమంది ట్రాక్టర్లలో ఇసుకను తరలించేవారు. మామూలుగా అయితే ఎవరైనా అటవీప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారనుకునేవారు. ఇసుక మాటున వీరంతా అక్రమంగా కలపను తరలిస్తున్నారన్న విషయం ఆలస్యంగా గుర్తించారు. ట్రాక్టర్‌లో నింపిన ఇసుక పక్కకు పడిపోకుండా చుట్టూ కర్రలను ఏర్పాటుచేయడం, ఇసుక లోపల కలప దుంగలను ఉంచడం లాంటి చర్యలను గమనించిన అధికారులు విస్తుపోయారు.