ఆదిలాబాద్,ఫిబ్రవరి23(జనంసాక్షి): జిల్లాలో మార్చి, ఏప్రిల్ నెలలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన ఉంటుందని మాజీఎంపి రాథోడ్ రమేశ్ అన్నారు. చంద్రబాబు పర్యటన అంటనే టిఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారని అన్నారు. టిడిపి బడుగు బలహీన వర్గాల పార్టీ అని, ఎంత మంది వెళ్లిపోయినా కొత్తగా నాయకులను తయారు చేస్తామని పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు. టిడిపి నాయకులను భయపెట్టి, ప్రలోభాలు చూపి, పనులు కావని బెదిరిస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు, పార్లమెంటరీ సభ్యులున్నారని ఖరీఫ్, రబీ పంటలు పండకుండా పోతున్నా నీటిని అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని చెబుతున్నా బ్యాంకులు మళ్లీ డబ్బులు కట్టించుకుంటున్నారని అవి వడ్డీలకు సరిపోవడం లేదన్నారు. దళితులకు భూ పంపిణీ అని చెప్పి ఒక్కోవూరులో 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని అవి కూడా తెరాస కార్యకర్తలకే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రమొస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పినా ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయడం లేదన్నారు. లక్ష ఉద్యోగాలు అని నిరుద్యోగులను మోసంచేశారన్నారు. కుటుంబ పాలనతో బంగారు తెలంగాణ సాధ్యమా అని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికా నిధులు 10 శాతం మాత్రమే ఖర్చుచేశారని అన్నారు. గృహనిర్మాణ, బీసీ, అటవీశాఖ మంత్రులున్నా ఆ శాఖలో సీబీసీఐడీ దర్యాప్తు జరిపించారని ఎంతమందిపై చర్యలు తసీఉకున్నారో చెప్పాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కోసం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.




