హైదరాబాద్ గచ్చిబౌలిలో అదృశ్యమైన టీసీఎస్ ఉద్యోగిని అనుశ్రీ ఆచూకీ దొరికింది. ఓ యువతి అపస్మారక స్థితిలో ఉందని పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను అనుశ్రీగా గుర్తించారు. అనుశ్రీని స్థానిక ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత గచ్చిబౌలికి తీసుకెళ్లారు. ఆమె మానసిక స్థితి బాగాలేదని, ఏమీ చెప్పే పరిస్థితుల్లో లేదని పోలీసులు తెలిపారు.
కర్ణాటక రాష్ర్టానికి చెందిన అనుశ్రీ(22) గచ్చిబౌలిలోని దివ్యసాయి హాస్టల్ లో ఉంటూ ఆదిభట్ల ఐటీ కారిడార్ లోని టీసీఎస్‌లో పనిచేస్తోంది. ఈ సోమవారం ఉదయం 8 గంటలకు స్వగ్రామంలోని తండ్రి ప్రభాకర్ కి ఫోన్ చేసి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పింది. దీంతో, ఆయన కర్నాటక నుంచి మంగళవారం ఉదయం హాస్టల్ కు వచ్చి విచారించగా సోమవారం ఉదయమే ఉద్యోగానికి వెళ్లిందని, తిరిగి రాలేదని చెప్పారు. అనుశ్రీ పనిచేస్తున్న ఐటీ కంపెనీకి వెళ్లి ఆరా తీయగా సోమవారం ఉద్యోగానికే రాలేదని తెలిపారు. స్నేహితులు, బంధువులు, తెలిసినవారి వద్ద ఆరాతీసినా అనుశ్రీ జాడ తెలియకపోవడంతో ప్రభాకర్ గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




