– గట్టులింగంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తాం
– నారాయణఖేడ్‌లో వెలుగు నింపుతాం
– టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టండి
– ముఖ్యమంత్రి కేసీఆర్
మెదక్,ఫిబ్రవరి 10(జనంసాక్షి): నారాయణఖేడ్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలపిస్తే గోదావరితో నారాయణఖేడ్ వాసుల కాళ్లు కడుగుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావ తెలిపారు. టీఆర్‌ఎస్‌తోనే నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాధ్యమని సీఎం అన్నారు. ఇవాళ ఆయన నారాయణఖేడ్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇంత పెద్ద బహిరంగ సభ నారాయణఖేడ్ చరిత్రలో ఎన్నడూ జరగలేదని అన్నారు. తాను కథలు చెప్పడానికి ఇక్కడకు రాలేదని తెలిపారు. తాను ఎంత కష్టపడి తెలంగాణ సాధించారో వివరించారు. ఒకానొక దశలో చావు నోట్లో తల పెట్టానని తెలిపారు. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత పాలకులు నారాయణఖేడ్‌ను వెనుకబాటుకు గురిచేశారని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. బుల్లెట్ లాంటి జిల్లా మంత్రి హరీష్‌రావు ఇక్కడి ప్రజలకు ఉన్నారని ఆయనతో విూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గోదావరి నీళ్లతో గట్టులింగంపల్లి ప్రాజెక్టు తెచ్చుకుందామని తెలిపారు. హరీష్‌రావుతో గోదావరి నీళ్లు తెచ్చి ఇక్కడి అక్కాచెళ్లెల్ల కాళ్లు కడుగుతామని అన్నారు. నీళ్లు తేవడమే కాదు ఇంటింటికి నల్లాను అమర్చి మంచినీటిని అందజేస్తామని తెలిపారు. కేసీఆర్ మొండి ఘటం మాట అంటే తప్పడని పేర్కొన్నారు. నారాయణఖేడ్‌ను నూటికి నూరు శాతం హరీష్‌రావు అన్నట్టు సిద్దిపేటలా చేసి చూపిస్తామన్నారు. ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. గత పాలకుల పాలనలో ఏమైందో ఇక్కడి ప్రజలకు తెలుసునన్నారు. ఇంకా నారాయణఖేడ్ దరిద్రంలోనే ఉండాలా, బయట పడాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు. వరంగల్ ఉప ఎన్నికలో కూడా టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. నారాయణఖేడ్ వెనుకబడి ఉండటం సీఎంగా తనకు గొప్పతనంగా లేదన్నారు. ఎన్నికల తర్వాత రెండు రోజులు నారాయణఖేడ్‌లో ఉండేలా చూసుకుని వస్తానని మండల కేంద్రాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హావిూ ఇచ్చారు. టీఆర్‌ఎస్ అధికార పార్టీ కాబట్టి టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి ఓటు వేస్తేనే నారాయణఖేడ్ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. విద్యావంతులు, యువకులు ఇక్కడి ఓటర్లను చైతన్య పరిచి టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
నారాయణఖేడ్‌ను సిద్దిపేటలా చేసి చూపిస్తా: హరీష్‌రావు
నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సిద్దిపేటలా చేసి చూపిస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇవాళ నారాయణఖేడ్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ఎన్నికల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో నారాయణఖేడ్ వెనుకబడి పోయిన విషయాన్ని ఇక్కడి ప్రజలు గమనించాలని కోరారు. ఇక్కడి ప్రజలు స్నానం చేసిన నీళ్లను వాడుకునే దుస్థితిలో ఉన్నారని వివరించారు. ఈ ఘనతకు కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. అందుకే తాను నారాయణఖేడ్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. మొన్న వరంగల్ టీఆర్‌ఎస్ ఖాతాలో చేరిందని, నిన్న జీహెచ్‌ఎంసీలో గులాబీ జెండా ఎగురవేశామని, రేపు నారాయణఖేడ్‌లో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.





