రైతుల ఆత్మహత్యల నివారణకు తెలంగాణ జాగృతి రంగంలోకి దిగింది. ఈ మేరకు రైతు ఆత్మహత్యలపై తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎంపి కవిత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆత్మహత్యలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండారాం, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తోడుగా వారి కుటుంబాల్లో మానసిక స్థైర్యం నింపేందుకు తెలంగాణ జాగృతి నడుం బిగించిందన్నారు.
రైతుల సంక్షేమంతోపాటు ఆత్మహత్యలను నిరోధించేందుకు దీర్ఘకాల వ్యూహంతో కార్యాచరణ రూపొందించినట్లు కవిత తెలిపారు. ఇందుకోసం లక్షా 20 వేల మంది తెలంగాణ జాగృతి వలంటీర్లను రంగంలోకి దింపుతామని చెప్పారు. రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ బాధిత రైతుల కుటుంబాలకు చేరేలా చూస్తామన్నారు.
అటు తెలంగాణ భవన్‌లో సింగరేణి వీఆర్‌ఎస్ కార్మికులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి అన్ని అంశాలపై దృష్టి పెడుతున్న సీఎం ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. 345 రోజుల నుంచి దీక్షను కొనసాగిస్తున్న సింగరేణి వీఆర్‌ఎస్ కార్మికులు తమ దీక్షను విరమించాలన్నారు. సీఎంను కలిసి సమస్యలను వివరించడమే కాకుండా 20 రోజుల్లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు.
అన్నదాతల ఆత్మహత్యల నివారణకు తెలంగాణ జాగృతి రంగంలోకి దిగడంపై ప్రభుత్వ పెద్దలు ప్రశంసలు కురిపిస్తున్నారు. రైతుకు అండగా నిలవడాన్ని అభినందిస్తున్నారు.




