నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపై హైకోర్టు ఫైర్ అయింది. అనుభవజ్ఞులు, అర్హులైన బోధన సిబ్బందిని నియమించకుండా కాలేజీలను ఎందుకు ఏర్పాటు చేశారని నిలదీసింది. ఇంజినీరింగ్ పీజీ తరగతులకు బీటెక్ చదివిన వారితో తరగతులు చెప్పించడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాగైతే విద్యాప్రమాణాలు ఎలా మెరుగవుతాయని ప్రశ్నించింది. కాలేజీల్లో కోర్సుల నిర్వహణకు అనుమతిని ఇవ్వాలంటే నిబంధనల ప్రకారం ప్రయోగశాలల్లో ఉండాల్సిన పరికరాలు, ఇతర మౌలిక సదుపాయలను ఆరువారాల్లో సమకూర్చుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
అర్హత కల్గిన బోధనా సిబ్బందిని మూడు నెలల్లో నియమించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నిబంధనలు పాటిస్తామని ఈ నోల 28 లోగా రాతపూర్వక హామీ పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది. ఆ తరువాతే కౌన్సెలింగ్‌కు అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తమ ఆదేశాల అమలును తనిఖీ చేసేందుకు జేఎన్‌టీయూహెచ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు పేర్కొంది. కమిటీలో హైకోర్టు సహాయ రిజిస్ట్రార్ సభ్యునిగా ఉంటారని కోర్టు తెలిపింది.నిర్ణీత సమయంలో నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలతోపాటు కాలేజీల అనుమతిని రద్దు చేస్తమని ధర్మాసనం హెచ్చరించింది.




