ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 26. (జనంసాక్షి). అందరి సహకారం సమిష్టి కృషితో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో అగ్రభాగాన నిలబడిందని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ తో పాటు శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు అధికారులు అందరి సహకారంతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుందని అన్నారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు 500 కోట్ల విలువైన బతుకమ్మ చీరాల ఆర్డర్ తో పాటు ఇతర ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. విద్యారంగంలో ప్రత్యేక చొరవతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. కరువుతో అల్లాడిన ప్రాంతం నేడు సస్యశ్యామలంగా మారిందని తెలిపారు. ధరణి పోర్టల్ , దళిత బంధు, రైతుబంధు తో పాటు మౌలికంగా అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. సిరిసిల్ల వేములవాడలో ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజరాజేశ్వర ఆలయం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుందని అన్నారు.స్వచ్ఛతలో జాతీయస్థాయిలో జిల్లా ముందుందని రానున్న రోజుల్లో జిల్లాను ను దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు తమ సహకారం అందించాలని అన్నారు. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు.కార్యక్రమంలో ఎస్పి రాహుల్ హెగ్డే, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, తెలంగాణ పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




