అమెరికాలో దుండగుల కాల్పుల్లో 13మందికి గాయాలు

కనెక్టికట్‌: అమెరికాలోని కనెక్టికట్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో వేడుకపై దుండగులు దాడి చేశారు. దుండగుల కాల్పుల్లో 13మందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు బ్రిడ్జ్‌పోర్ట్‌ ప్రాంతంలో పార్టీ జరుగుతున్న ఓ ఇంటిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఓ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు. అనుమతి లేకుండా పార్టీలో మద్యం సేవించినందుకు నిర్వాహకులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.