మంచిర్యాల: ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల కావడంలేదు. దీంతో ఆర్భాటంగా ప్రారంభమవుతున్న వివిధ కార్యకలాపాలు అసంపూర్తిగా ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాలలో సైతం ఇదే తంతు కొనసాగగా పనులు మధ్యలోనే ఆగిపోవడం గమనార్హం. పుష్కరాల తర్వాత కొనసాగుతాయనుకున్న అభివృద్ధి పనులు నెల రోజులు గడిచినా ప్రారంభంకాలేదు. జూలై 14 నుంచి 26వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరిగాయి. ఇందులో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.51 కోట్లు కేటాయించింది. ఇందులో నూతన సీసీ రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల వెడల్పు, బీటీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం తోపాటు భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, స్నానపుగదుల నిర్మాణం తదితర పనులు చేపట్టారు.పుష్కరాల సమయం దగ్గర పడటంతో మున్సిపాలిటీ పరిధిలో కొన్ని అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నిలిపివేశారు. పుష్కర పను ల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారి అధర్సిన్హాతో స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఈ విషయమై చర్చించి సమయాభావంవల్ల కొన్ని పనులను నిలిపివేయక తప్పడంలేదని తెలియజేశారు. పుష్కరాలు పూర్తికాగానే మధ్యలో నిలిపివేసిన పనులను తిరిగి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అయితే పుష్కరాలు ముగిసి నెల రోజులు కావస్తున్నా ఇంత వరకు పనులు పున:ప్రారంభం కాకపోవడం గమనార్హం. ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతోనే కాంట్రాక్టర్లు పనులను ప్రారంభించడంలేదని సమాచారం. గోదావరి రోడ్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం స్థానిక శిశుమందిర్ పాఠశాల వరకే చేపట్టారు. అక్కడి నుంచి గోదావరి నది ఒడ్డు వరకు మరో కిలోమీటరుపైగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టవలసి ఉంది. రూ. 2 కోట్ల, 91 లక్షల, 87వేల 447 అంచనా విలువగల సీసీ రోడ్డు పెండింగ్‌లో ఉండిపోయింది. అలాగే స్టేషన్ రోడ్డులో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణం కూడా స్థానిక ముఖరాం చౌరస్తా వద్ద నిలిచిపోయింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి రైల్వే స్టేషన్ వరకు రూ. 2 కోట్లకు పైగా అంచనాతో డివైడర్‌కు ఇరువైపులా బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టవలసి ఉండగా ఒకే వైపు మాత్రమే నిర్మాణం జరిగింది. మరో వైపు పనులు ప్రారంభం కాలేదు.గోదావరి పుష్కరాల నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో భక్తుల సౌకర్యార్థం పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 9 కోట్ల 51 లక్షలు కేటాయించింది. పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. దీంతో మున్సిపాలిటీ అధికారులు ఆగమేఘాలమీద పనులు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పెట్టుబడులుపెట్టిన కాంట్రాక్టర్లు నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తిచేసేందుకు రాత్రింబవళ్లు కూలీలను పురమాయించారు. అయితే 70 శాతం పనులు పూర్తయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. అప్పులుచేసి పెట్టుబడులు పెట్టినదంతా రెండు నెలలుగా చేతికి అందకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పనుల నాణ్యతలో లోపం తలెత్తితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ హుకుం జారీ చేయడంతో సాధ్యమైనంత వరకు రాజీపడకుండా పనులు నిర్వహించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన గోదావరి పుష్కర పనులకు రెండు నెలలు గడిచినా నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు మనోవేదనకు గురవుతున్నారుఅయితే పుష్కర నిధులను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు అప్పగించే యత్నం చేస్తున్నట్లు సమాచారం. పట్టణాల్లో మున్సిపాలిటీలు, గ్రామాల్లో గ్రామపంచాయితీలు భరించే విధంగా ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీల్లో జనరల్ ఫండ్ నుంచి పుష్కర నిధులను విడుదల చేయించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని వార్డు ల్లో చేపట్టవలసిన పనుల్లో మార్పుచేసి కొందరు కాంట్రాక్టర్లకు పుష్కర పనులకింద నిధులు విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పుష్కర పనుల కింద ఇప్పటి వరకు అనధికారికంగా రూ. 2 కోట్ల వరకు బిల్లులు చెల్లించినట్లు సమాచారం. ఇదే తంతు కిం ద మిగతా పుష్కర నిధులను సైతం మున్సిపాలిటీ నుంచి విడుదల చేయించేందుకు కొందరు ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పెద్ద మొత్తంలో ప్రజాధనానికి గండిపడే అవకాశం ఉంది. పేరుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ఉండగా నిధులు మాత్రం స్థానిక సంస్థలు భరించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుండటం విశేషం.




