Wednesday, 4 November 2026

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం….

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది… రైతు ఆత్మహత్యలు సహా.. పలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టి సమావేశాలను తమకు అనుకూలంగా ముగించాలని సర్కారు పట్టుదలగా ఉంది..ఈ నెల 23నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి… ఇటీవలే మరణించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సంతాపం తెలిపాక తొలిరోజు సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బిఏసీ సమావేశం జరగనుంది… ఇందులో అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై చర్చించనున్నారు.రైతు ఆత్మహత్యలపై ఇప్పటికే ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది.. ప్రతిపక్షాలు టీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి… ఈ అంశంపై సభలో నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.. అయితే ప్రభుత్వం విపక్షాలను కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకిచ్చే పరిహారాన్ని ఆరు లక్షలకు పెంచిన ప్రభుత్వం.. బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల వివరాలను, వారి ఆత్మహత్యలకు కారణాలను సేకరిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన ఆత్మహత్యల వివరాలనూ సభ ముందుంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సభలో ప్రకటన చేసే అవకాశమూ ఉంది.ప్రాజెక్టుల డిజైన్ మార్పు అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షం సన్నద్ధమైంది. నిర్మాణంలోని ప్రాజెక్టుల వివరాలు, రైతులకు జరిగే మేళ్ల గురించిన వివరాలతో విపక్షాన్ని నిలువరించాలని సర్కారు యోచిస్తోంది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు హామీలు సర్కారుకు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఇప్పటివరకూ అడుకుకూడా ముందుకుపడలేదు.. ఇక ఫీజు బకాయిలు, ఉస్మానియా యూనివర్శిటీ దుస్థితి, నకిలీ విత్తనాలు, మైనారిటీ, ఎస్టీల రిజర్వేషన్లు, ఎన్‌కౌంటర్, ఇండ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాలపై సభలో వాడివేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.. అధికార, ప్రతిపక్షాల ప్రత్యేక వ్యూహాలతో ఈ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *