Wednesday, 4 November 2026

మోడల్ స్కూళ్ల వసతులకు రూ. 239 కోట్లు

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్య, మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మేరకు పాఠశాల స్థాయిలో విద్యా, వసతులను మెరుగు పర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్షియల్, కస్తూర్బా, మోడల్ స్కూళ్లలో మౌళిక వసతుల కోసం 239 కోట్ల రూపాయలను కేటాయించింది. హైదరాబాద్ సచివాలయంలో జరిగిన సమావేశంలో.. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు…
రాష్ట్ర వ్యాప్తంగా 51 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 71 వేల 880 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటికి కాంపౌండ్ వాల్స్, కిచెన్ రూంలు, ఇతర మౌళిక వసతుల కోసం 89 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. అలాగే రాష్ట్రంలో 391 కస్తూర్బా బాలికల విద్యాలయాలు నడుస్తున్నాయి. వీటిలో 71 వేల 600 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ స్కూళ్లలో కాంపౌండ్ వాల్స్, టాయిలెట్ల నిర్మాణం, సి.సి కెమెరాలు, హాస్టళ్లలో సైరన్ ల ఏర్పాటు కోసం 50 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అటు 194 మోడల్ స్కూళ్లు మంజూరు కాగా.. ప్రస్తుతం 185 సూళ్లు నడుస్తున్నాయి. ఈ స్కూళ్లలో 85 వేల 165 మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో మౌలిక సదుపాయాలు, కాంపౌండ్ వాల్స్ తదితర సౌకర్యాల కల్పన కోసం 100 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ ఉచిత విద్యను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వివిధ సంస్థల కింద పనిచేస్తున్న పాఠశాలలన్నింటిలో వచ్చే సంవత్సరం మార్చి నాటికి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *