– సాంకేతికతరంగంలో మహిళలకు అపార అవకాశాలు
– వాటిని అందిపుచ్చుకొనేందుకు సిద్ధంగా ఉండాలి
– స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను మహిళాకోణంలో చూడొద్దు
– జీఈఎస్ రెండవరోజు ప్లీనరీ సమావేశంలో ఇవాంకట్రంప్
– మహిళలకు ఇంటినుంచే పనిచేసే అవకాశం ఇవ్వాలి: చందాకొచ్చర్
హైదరాబాద్,నవంబర్ 29,(జనంసాక్షి): సాంకేతిక రంగం అభివృద్ధితో మహిళలకు, మహిళా పారిశ్రామికవేత్తలకు అపార అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని, మహిళలు వాటిని అందిపుచ్చుకొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇవాంక ట్రంప్ అన్నారు. రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి మంత్రి కేటీఆర్ మాడరేటర్‌గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాంకా పాల్గొని మాట్లాడుతూ.. సాంకేతిక విభాగంలో మహిళా పారిశ్రామివేత్తలకు అవకాశాలు ఉన్నాయన్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు. నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణలన్నీ ప్రైవేటు రంగంలోనే వస్తున్నాయని.. ఏ రంగంలోనైనా సేవలు బాగుంటేనే ఆదరణ ఉంటుందని ఆమె తెలిపారు. స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను మహిళా కోణంలో చూడవద్దని సమాజంలో సగభాగమైన వారి సమస్యలను క్లిష్ట సమస్యలుగా భావించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు విభిన్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఇవాంకా గుర్తుచేశారు. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడం ఎంతో ముఖ్యమన్నారు. అమెరికన్ వర్సిటీల్లో మహిళలకు సాంకేతిక విద్యను అందించడంపై ఎక్కువ శ్రద్ధా పెట్టామని తెలిపారు. మహిళలకు ప్రధానంగా నమ్మకం, సామర్థ్యం, మూలధనం ఉండాలని చెప్పారు. మహిళలు తమతో ఏ విషయంలో తీసిపోరని పురుషులు గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
ఇంటినుంచే పనిచేసే అవకాశం ఇవ్వాలి – చందాకొచ్చర్
సాంతికేకత సహాయంతో మహిళలకు ఇంటినుంచే పనిచేసే అవకాశాలను మరింత మెరుగుపరచాలని ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ అన్నారు. రెండో రోజు జీఈఎస్ ప్లీనరీ సమావేశాల్లో చందా కొచ్చర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చాలామంది మహిళలు కెరీర్‌ను వదులుకుంటారన్నారు. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో కెరీర్‌ను వదులుకునే ఆలోచన చేయొద్దని మహిళలను ఆమె కోరారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపినప్పుడే ముందుకు వెళ్లగలమన్నారు. వృద్ధులు, పిల్లలను చూసుకుంటూ మహిళలు ఇంటి నుంచి పనిచేయవచ్చని చెప్పారు. సాంకేతికను వినియోగించి ఇంటినుంచి పనిచేసే అవకాశాలు ఇవ్వాలని ఆమె కోరారు. మహిళలు విద్యావంతులైతే ఒక తరం మొత్తం విద్యావంతమైతదన్నారు. జీఎస్‌ఆర్ ద్వారా మహిళాభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి మరిన్ని శిక్షణ కేంద్రాలు అవసరమన్నారు ముఖ్యంగా గ్రావిూణ ప్రాంతాల్లో వాటి అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రావిూణరంగ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. తాము శిక్షణ ఇచ్చినవారిలో 95 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన పిల్లలే తనకు పెద్దస్ఫూర్తి అని చందాకొచ్చర్ చెప్పుకొచ్చారు. విద్య, ప్రోత్సాహం, సాధికారత ఉంటే మహిళలు ఏదైనా సాధిస్తారన్నారు. భారతదేశంలో మహిళా భాగస్వామ్యం చాలాపెరిగిందన్నారు. బ్యాంకింగ్ రంగంలో 40శాతం మహిళలు పనిచేస్తున్నారన్నారు. దేశం నుంచి మహిళా క్రీడాకారిణులు అన్ని విభాగాల్లో ఉన్నారని తెలిపారు. నేడు భారతదేశ రక్షణశాఖ మంత్రి మహిళా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 7-8 ఏళ్లలో భారత జీడీపీ 700 బిలియన్ డాలర్లకు చేరుకోబోతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ మాట్లాడుతూ.. భారత్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని, భారత్ లాంటి దేశాల్లో మహిళా భాగస్వామ్యం ఉంటేనే వృద్ధి సాధ్యమవుతుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు మహిళాశక్తి ఎంతో అవసరరమని, గ్రావిూణ మహిళలకు సూక్ష్మరుణాలు అధికంగా ఇవ్వాలని, తద్వారా వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంచాలన్నారు. ఉద్యోగం, కుటుంబం నిర్వహణలో మహిళలు సమర్థంగా వ్యవహరిస్తున్నారని చెర్రీ తెలిపారు. డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్ మాట్లాడుతూ .. కాలానుగుణంగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు తీసుకురావాలని తెలిపారు. సాంకేతకత రోజురోజుకూ మరింత స్మార్ట్‌గా మారుతోందని, దానిని అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో రాణిస్తే మహిళల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు.
ప్లీనరీలో నవ్వులు పూయించిన కేటీఆర్..
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి కేటీఆర్ బుధవారం జరిగిన జీఈఎస్ సదస్సులో ఇవాంక ట్రంప్‌తో సహా సదస్సులో పాల్గొన్న వారిలో నవ్వులు పూయించారు. రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ప్లీనరీ జరిగింది. దానికి మంత్రి కేటీఆర్ మాడరేటర్‌గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు. మొదట ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్‌ను మంత్రి కేటీఆర్ వేదిక విూదకు ఆహ్వానించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కూడా మంత్రి ఆహ్వానించారు. అయితే ఇవాంకాను పరిచయం చేసే సమయంలో మంత్రి కేటీఆర్ కొంత చమత్కారాన్ని ప్రదర్శించారు. తాను రాష్టాన్రికి ఐటీ మంత్రిని అని, కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఐటీ నామస్మరణ జరుగుతున్నదని, ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ అని.. తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇవాంక నామస్మరణ జరుగుతుందని మంత్రి కేటీఆర్ నవ్వులు పూయించారు. మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నారు.
ఇవాంకాను మెచ్చుకున్న డోనాల్డ్ ట్రంప్
అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న ఇవాంకా ట్రంప్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేధికగా ప్రశంసలు కురిపించారు. చాలా గొప్ప పని చేశావంటూ తన సలహాదారు, కూతురు అయిన ఇవాంకాను డోనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. గ్రేట్‌వర్క్ ఇవాంకా అంటూ ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. జీఈఎస్‌లో మొదటి రోజు సదస్సుకు వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి ఇవాంకా మాట్లాడారు. మహిళలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధంగా తమ ప్రభుత్వం విధానాలను రూపొందిస్తున్నదని ఇవాంకా ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. వర్క్‌ఫోర్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం అమెరికా ప్రభుత్వం అనేక విధానాలను అమలు చేస్తున్నదని ఆమె అన్నారు. తమ కలలను తమ
భవిష్యత్తుగా మార్చుకునేందుకు మహిళా వ్యాపారవేత్తలకు సహాకారం అందిస్తున్నామని ఇవాంకా ఆ ప్రసంగంలో తెలిపారు.





