Wednesday, 4 November 2026

ఆపన్నులను ఆదరించిన జనహిత సేవా సమితి.

ఆపన్నులను ఆదరించిన జనహిత సేవా సమితి.
బెల్లంపల్లి, డిసెంబర్ 3, (జనంసాక్షి )
బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నాగుల నారాయణ మరియు రోడ్డు ప్రమాదంలో మరణించిన నాగుల లక్ష్మి నారాయణ కుటుంబాలకు శనివారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నగదు, బియ్యం అందజేశారు. ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ రంగపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగుల నారాయణ పక్షవాతం వచ్చి కదలలేని స్థితిలో ఉండటంతో వారి కుటుంబం పడుతున్న ఇబ్బందులు గమనించి దాతల నుంచి సేకరించిన నిధి నుంచి నారాయణ కుటుంబానికి ₹ 5 వేల రూపాయల నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశామని, ఇదే గ్రామంలో రోజువారీ కూలి పనులు చేసుకునే నాగుల లక్ష్మీనారాయణ నవంబర్ 30న రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించడంతో ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి ఆసరాగా 50 కేజీల బియ్యం, ₹ 2 వేల రూపాయల నగదు అందజేశామన్నారు. ఈకార్యక్రమంలో జనహిత సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి, గౌరవ సలహాదారుడు నిచ్చకోలా రాజన్న, సభ్యులు పాయవేణి మల్లేష్, బోలిశెట్టి సుధాకర్, జుట్టు రాజన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.