*ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలిద్దాం*
మునగాల, సెప్టెంబర్ 15(జనంసాక్షి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం రేపాల ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో 13 గ్రామ పంచాయతీలలో అంగన్వాడి స్కూల్ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశామని హెల్త్ అసిస్టెంట్ లింగం రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులలో నులిపురుగులు ఉండడం ద్వారా పోషకాహార లోపం, రక్తహీనతతో ఎప్పుడూ అలసిపోతుంటారని, శారీరక మానసిక అభివృద్ధిలో మందకొడిగా ఉంటారని, దీనికోసం పరిశుభ్రత పాటిస్తూ గోర్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. శుభ్రమైన పండ్లు, కాయగూరలను ఎక్కువ తీసుకోవాలని, తప్పకుండా చెప్పులు ధరించాలని, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయరాదని, మరుగుదొడ్డిని వాడాలని, భోజనం చేసే ముందు మరియు మలవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. అంతేగాక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2253 మందికి గాను 2034 మందికి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. దాదాపు 90% విజయవంతం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు సమిష్టి కృషితో కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు.