సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 5 :\జిల్లాలో ఆరోగ్య మహిళా కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత మెడికల్ ఆఫీసర్లకుఆదేశించారు.
శుక్రవారం కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో ఆరోగ్య మహిళ, కంటి వెలుగు, ధాన్యం కొనుగోళ్ల పురోగతి, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ప్రతి మంగళవారం జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా ప్రత్యేకించి మహిళలకు వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఆయా రిఫరల్ కేసులకు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు ఆరోగ్య మహిళ కేంద్రాలలో 2,849 మంది మహిళలను పరీక్షించామని తెలిపారు.175 రిఫరల్ కేసులను గుర్తించి, 133 కేసులకు సంబంధించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.మిగతా 42 కేసులకు సంబంధించి ఫాలప్ చేయాలని సంబంధిత ఆరోగ్య మహిళా కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు సూచించారు.
ఆరోగ్య మహిళా కేంద్రాలలో గుర్తించిన రెఫరల్ కేసులను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపని సంబంధిత డాక్టర్ల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిఫరల్ కేసులలో వారికి ట్రీట్మెంట్ అందించే వరకు పూర్తి బాధ్యత మెడికల్ ఆఫీసర్లదేనని స్పష్టం చేసారు.
ఝరాసంఘం ఆరోగ్య మహిళా కేంద్రంలో ఒక కేసులో బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించి, సంబంధిత మహిళకు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో క్యాన్సర్ సోకిన బ్రెస్ట్ ను తొలగించారని, తదుపరి చికిత్స కు హైదరాబాద్ లోని ఎం.ఎన్.జే. క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరాలలో కంటి పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని వైద్యాధికారులకు సూచించారు.
ఈ నెల 4వ తేదీ నాటికి జిల్లాలో 10,01,266 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.74,902 మందికి రీడింగ్ గ్లాసులను ఇచ్చామని,44,448 మందికి ప్రెస్క్రిప్షన్ గ్లాసులను అందజేశామని తెలిపారు. ఇదే స్పూర్తితో పని చేయాలని వైద్యులకు సూచించారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ సాఫీగా జరగాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆయా అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం
కొనుగోళ్లు సజావుగా పూర్తయ్యేలా చూడాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఉండాలన్నారు.
రైతులు విక్రయించిన ధాన్యం, రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ గాయత్రీ దేవి, జిల్లా వ్యవసాయ శాఖ జె డి నరసింహారావు, సివిల్ సప్లైస్ సంస్థ డిఎం సుగుణ బాయ్, పౌరసరఫరాల శాఖ అధికారిని వనజాత, డాక్ట ర్ శశాంక్,తదితరులు పాల్గొన్నారు.




