విధుల్లో చేరేందుకు కండిషన్లు పెట్టం:సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు. రేపు(శుక్రవారం) విధుల్లో సంతోషంగా చేరాలని ఆదేశించారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరొచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్ ప్రయాణికులపై భారం మోపారు. టిక్కెట్ చార్జీలు పెంచారు. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతున్నట్టు తెలిపారు. పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఆర్టీసీ ప్రైవేటుపరం చేయబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కోలుకునేందుకు తాత్కాలికంగా వంద కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కార్మిక సంఘాలను క్షమించబోమని అన్నారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా యిచ్చారు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు.ఆర్టీసీ కార్మికులు క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా బోనస్‌లు ఇప్పిస్తానని, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. డిపో నుంచి ఇద్దరితో వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రియలైజ్ కావాలనే తాను సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించానని వెల్లడించారు. కార్మిక నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఆర్టీసీ కార్మికులను మోసం చేశారని విమర్శించారు. అడ్డం పొడవు మాట్లాడి ఇంకా కార్మికులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు.