Tuesday, 3 November 2026

ఆర్టీసీ సమ్మె సైరన్‌ మోగింది

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ కార్మిక సంఘాలతో త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలం

దూరప్రాంతాలకు, ఇతరరాష్ట్రాలకు వెళ్లే బస్సు డ్రైవర్లు శుక్రవారమే డిపోలకే పరిమితమయ్యాయి

హైదరాబాద్‌ : దాదాపు నాలుగేళ్ల తరువాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్‌ మోగింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మె వైపే మొగ్గు చూపారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో దూరప్రాంతాలకు, ఇతరరాష్ట్రాలకు వెళ్లే బస్సు డ్రైవర్లు శుక్రవారమే ఉన్న పళంగా విధుల నుంచి వైదొలిగారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే సమ్మె మొదలైనట్లయింది. దీంతో సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూసిన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. ఇక శుక్రవారం అర్దరాత్రి నుంచే బస్సులు ఎక్కడికక్కడా ఆగిపోయాయి. సిటీ బస్సులు శనివారం ఉదయం నుంచే డిపోలకే పరిమితమయ్యాయి. ఆదివారం సద్దుల బతుకమ్మ కావడంతో ఊళ్లకు బయల్దేరిన ప్రయాణికులు బస్‌స్టాండ్‌లలో నానాతంటాలు పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రయివేట్‌ యాజమాన్యాలు దోపిడి పర్వానికి దిగుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ప్రయాణికులు ఉన్నారు. ఇక ప్రయివేట్‌ సిబ్బందితో బస్సులు నడిపించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. శనివారం ఉదయమే ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు కూర్చుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేశారు. కనీసం కొన్ని బస్సులు అయినా నడిచేలా పోలీసులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కాస్త గందరగొళ పరిస్థితి ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ ‌: 
జేబీఎస్‌: ఆర్టీసీ సమ్మె కారణంగా జూబ్లీ బస్‌ స్టెషన్‌లో బస్సులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. దీంతో ఊళ్లకు వెళ్దామనుకున్న ప్రయాణికులు జేబీఎస్‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా ముందుకు కదల్లేదు. దీంతో బస్‌ స్టేషన్‌లోనే ప్రయాణకులు వేచి చూస్తాన్నారు. ఇదే అదునుగా భావించిన
ప్రయివేట్‌ ట్రావెల్స్‌, క్యాబ్‌లు అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నాయి.

నాగర్‌ కర్నూల్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో నాగర్‌ కర్నూల్‌ డిపోల్లోనే బస్సులు నిలిచిపోయాయి. ఉదయం నుంచే డిపోల ముందు కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి బస్సు డిపో ముందు కార్మికులు బస్సులు కదలకుండా బైఠాయించారు. అయితే  పోలీసుల సహకారంతో కొన్ని ప్రయివేట్‌ సర్వీసులను నడిపించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌:  ఉమ్మడి జిల్లాలోని 9 డిపోల పరిధిలో 880 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచే డిపోల ముందు కార్మికులు భైఠాయించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.