ఆ రెండు నిమిషాల్లో ఏం జరిగింది?
సైన్-లెస్-ఆల్ఫ్స్(ఫ్రాన్స్): ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో మంగళవారం కూలిపోయిన జర్మన్‌వింగ్స్ ఎయిర్‌బస్ 320 విమానానికి చెందిన బ్లాక్‌బాక్స్ నుంచి ఆడియో సమాచారాన్ని అధికారులు సేకరించారు. ప్రమాదానికి సంబంధించి కీలక సమాచారం నిక్షిప్తం అయ్యే బ్లాక్‌బాక్స్‌ను అధికారులు బుధవారం పగులగొట్టి తెరిచారు. మంగళవారం ఉదయం 10:30-10:31 గంటల మధ్యే విమానం కూలిందని, ఈ రెండు నిమిషాల్లో ఏం జరిగిందన్నది బ్లాక్‌బాక్స్ సమాచారంతో వెల్లడికావచ్చని భావిస్తున్నారు. అయితే, బ్లాక్‌బాక్స్ నుంచి సేకరించిన ఆడియోలో ఏం ఉందన్న వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.
కాగా, విమాన సమాచారం నిక్షిప్తం అయ్యే రెండో బ్లాక్‌బాక్స్ ఇంకా లభించాల్సి ఉందని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నార్డ్ కాజెనీవ్ తెలిపారు. ఎయిర్‌బస్ 320 విమానంలో ప్రమాద సమయంలో 150 మంది ఉండగా, ఎవరూ బతికేందుకు అవకాశం లేదని ఇదివరకే ఫ్రాన్స్ ప్రకటించింది. అతి క్లిష్టమైన పర్వత ప్రాంతంలో ఉన్న ప్రమాదస్థలికి చేరుకున్న సైనిక సిబ్బంది సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటోంది. విమానం బలంగా ఢీకొట్టడంతో శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే, ప్రమాదం వెనక ఉగ్రవాదం, ఇతర కుట్ర వంటి కోణాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని జర్మనీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఒకే కుటుంబంలో మూడు తరాలు…
ఎయిర్‌బస్ విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మూడుతరాల వారు మృత్యువాతపడ్డారు. బార్సిలోనాకు చెందిన ఓ విద్యార్థిని, ఆమె తల్లి, నానమ్మ ప్రమాదంలో మృతిచెందారు.
జర్మన్‌వింగ్స్ విమానం రద్దు..
జర్మన్‌వింగ్స్ ఎయిర్‌బస్ విమాన దుర్ఘటన నేపథ్యంలో ఆ సంస్థ విమానం నడిపేందుకు పైలట్లు నిరాకరించడంతో బుధవారం ఓ విమానాన్ని రద్దుచేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
ఒబామా సంతాపం..
ఫ్రాన్స్‌లో విమాన దుర్ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సంతాపం ప్రకటించారు. జర్మనీ, ఫ్రాన్స్, తదితర దేశాలకు చెందిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.