బంజారాహిల్స్: ఇందిరానగర్‌లో సూదిగాడి వ్యవహారం కలకలం రేపింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2 ఇందిరానగర్‌కు చెందిన పాండు కూలీ పనిచేసుకుంటూ భార్య, కుమార్తె కావ్య(3)ను పోషించుకుంటున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి వద్ద మెట్లపై కావ్య ఆడుకుంటోంది. కొద్దిసేపటికి బాలిక కాలికి సూది ఉండటం గమనించారు. కావ్య వద్ద ఉన్న యువకుడు సూదితో దాడి చేస్తున్నాడని స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. దీంతో యువకుడు పారిపోవడానికి ఒకరి చేతిని కొరికాడు. తమ అనుమానం నిజమే అనుకొని స్థానికులు అతడిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. తన పేరు గట్టు సురేష్ అని చెబుతున్నాడు. మూడేళ్లుగా ఇందిరానగర్‌లో నివాసముంటున్నానని, హిమాయత్‌నగర్‌లోగల అబీబ్ మీడియా సెంటర్‌లో ఉద్యోగినని తెలిపాడు. పాప సూదితో ఆడుకుంటుంటే ప్రమాదం జరుగుతుందని దాన్ని తీసుకున్నానని, స్థానికులు అపోహ పడి తనను కొట్టారని వివరించాడు. భయంతోనే ఒకరిని కొరికానని, తనకు ఏ పాపం తెలియదని చెప్పాడు. కావ్యను చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.




