కెసిఆర్ దళిత ద్రోహి అని వ్యాఖ్య
హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): దళితులకు,మహిళలకు ముక్యమంత్రి కెపిఆర్ వ్యతిరేకి అని తెలంగాణ టిడిపి సీనియర్‌నేత మోత్కుపల్లి నర్సింహులు ఆందోళనకు దిగారు. మాల,మాదిగలకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదంటూ ఇందిరాపార్క్ వద్ద ఆయన నిరశన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాల మాదిగలు ధూ ధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా దళితులకు అధికారం దక్కడం లేదని మోత్కుపల్లి ఆక్షేపించారు. కేసీఆర్ దళితులను అడుగడుగునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. శాసనసభలో సైతం ఎమ్మెల్యేల గొంతునొక్కుతున్నారని విమర్శించారు. కేసీఆర్ లాంటి దొంగలు అడుగడుగునా దళితులను మోసం చేస్తున్నారని మోత్కుపల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోసాలను ఎదుర్కునే ధైర్యం మనకే ఉందన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ దొరతనం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చావు డప్పు ఎలా కొట్టాలో తాను చూపిస్తానన్నారు. కేసీఆర్ గొంతు కూడా మూగబోయే సమయం వస్తుందని ఆయన తెలిపారు. సర్కార్‌పై పోరాటం కొనసాగుతుందని మోత్కుపల్లి స్పష్టం చేశారు. తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, నగర అధ్యక్షుడు కృష్ణయాదవ్, పార్టీ సీనియర్‌నేతలు, పెద్ద సంఖ్యలో దళితులు పాల్గొన్నారు.




