ఇది రైతులు సాధించిన అద్భుత విజయం
సాగుచట్టాల రద్దుపై తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై,నవంబర్19(జనం సాక్షి ) :
ప్రధాని నరేంద్రమోదీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై దేశంలోని పలువురు కీలక నేతల నుంచి విభిన్న స్పందన కనిపిస్తున్నది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ప్రధాని ప్రకటనపై స్పందించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ గత కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనల ఫలితమే ఇప్పుడు కేంద్రం వెనక్కి తగ్గడానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని సీఎం స్టాలిన్ చెప్పారు. రైతులు ఆందోళనలు చేసి కేంద్రం మెడలు వంచడం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. ఇది రైతులు సాధించిన అద్భుతమైన విజయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.