హైదరాబాద్: వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. డెంగీ వ్వాధిపై ప్రభుత్వాధికారులతో సమీక్ష జరిపానని ఆయన చెప్పారు. రోగులకు అందుబాటులో ఉండే సంప్రదాయ, ప్రకృతి సిద్ధమైన మందులు ఇస్తున్నామని ఆజాద్ చెప్పారు. ఆయన ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. తెలంగాణపై ఇప్పటికరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆజాద్ స్పష్టం చేశారు. గతంలో విభజించిన మూడు రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ను అంత తేలిగ్గా విభజించలేమని గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదని స్పష్టం చేశారు. తెలంగాణపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. సప్రదింపుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, అన్ని స్థాయుల నేతలతో రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నామని వివరించారు. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నేతలతో చర్చించాల్సి ఉందని చెప్పారు. ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తున్నామని ఏకాభిప్రాయం సాధిస్తేనే కేంద్రం నిర్ణయం తీసుకోగలదని చెప్పారు.




