– లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
న్యూఢిల్లీ, జులై10(జనం సాక్షి ) : ఈసారైనా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగనివ్వాలని కోరుతూ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీలకు లేఖ రాశారు. గత పార్లమెంటు సమావేశాల్లో వివిధ అంశాలపై ఎంపీల ఆందోళనలతో గందరగోళ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఎలాంటి తీర్మానాలు లేకుండానే సమావేశాలు ముగిశాయి. తిరిగి వచ్చే వారంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడైనా సభను సక్రమంగా జరగనివ్వాలని స్పీకర్ రాసిన లేఖలో ఎంపీలను కోరారు. సభ సజావుగా నిర్వహించడం పట్ల ఎంపీలకు ఉన్న నైతిక బాధ్యతను ఆమె గుర్తుచేశారు. ‘మన పార్లమెంటుకు, ప్రజాస్వామ్యానికి మంచి పేరు తీసుకొచ్చేందుకు ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్లాలో సమష్టిగా పరిశీలించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. పార్లమెంటు పవిత్రత, ప్రతిష్ఠను కాపాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పవిత్రమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిదని, నా అనుభవం ప్రకారం.. ప్రజలు తమ ప్రతినిధుల పనితీరును చాలా నిశితంగా పరిశీలిస్తారన్నారు. విూడియా కూడా పార్లమెంటు, పార్లమెంటేరియన్ల పనితీరును వివరంగా ప్రజలకు చూపిస్తుందని స్పీకర్ అన్నారు. ఈ మేరకు రెండు పేజీల లేఖలో పేర్కొన్నారు. ఆమె ఎనిమిదో సారి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్లమెంటులో ఎంపీల ప్రవర్తనాతీరు, వారి చర్చలు, అందులోని నాణ్యత యువతలో ప్రజాస్వామ్యం పట్ల ఓ అవగాహన ఏర్పరుస్తుందని ఆమె తెలిపారు. ఆమె భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని కూడా ఉటంకించారు. గొప్ప వ్యక్తులు చేసిన పనులనే ఇతరులు అనుసరిస్తుంటారు. వారు ఏర్పరిచిన ప్రామాణికాలనే ప్రపంచం
అనుసరిస్తుందని ఆ శ్లోకం అర్థం. ఎంపీలు రాజకీయ వివాదాలు నియోజకవర్గాలకు పరిమితం చేసి, పార్లమెంటులో ప్రజాస్వామ్య బద్ధంగా వారి బాధ్యతను నెరవేరుస్తారని ఆశిస్తున్నానని సుమిత్ర లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్నాయి.
ఈసారైనా సభ జరగనివ్వండి




