Wednesday, 4 November 2026

ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డుల ప్రదానం

మక్తల్, మార్చి 24 (జనంసాక్షి)
మక్తల్ మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు మండల స్థాయిలో నేషనల్ పంచాయతీ అవార్డ్స్ రావడం జరిగింది. ఈ అవార్డును శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎంపీపీ వనజా దత్తు ల చేతుల మీదుగా సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ లకు అందజేస్తూ వారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మక్తల్ మండల పరిధిలో 15 గ్రామ పంచాయతీలకు అవార్డులు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇందుకు కృషిచేసిన గ్రామాల సర్పంచులను, పంచాయతీ సెక్రటరీలను, ఎంపీటీసీలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అభినందించారు. గ్రామాలు అభివృద్ధి పతం లో నడువాలంటే ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎవరి పార్టీలకు వారు పని చేసుకోవచ్చు కానీ ఆ గ్రామ అభివృద్ధికి మాత్రం అందరూ కలిసికట్టుగా కృషి చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధిలో మారుతాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. నేడు మండల స్థాయిలో 15 గ్రామ పంచాయతీలకు అవార్డులు రావడం హర్షనీయమని ఎమ్మెల్యే అన్నారు. మండల స్థాయిలో అవార్డులు అందుకున్న 15 గ్రామ ముష్టిపల్లి, ఖానాపూర్, జక్లేర్, చిట్యాల, దాసర్ దొడ్డి, కాచువార్, పారెవుల, పంచదేవ్ పహాడ్, భూత్పూర్, లింగంపల్లి, కాట్రేవుపల్లి, కర్ని, గోలపల్లి, నర్సరేడ్డి పల్లి, జవలాపురం గ్రామ పంచాయతీలు ఎన్నిక కాబడ్డాయి. మండల స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిచిన 15 గ్రామ పంచాయతీ పేర్లను జిల్లా స్థాయికి పంపడం జరిగిందని అధికారులు తెలిపారు. వీటిలో జిల్లా స్థాయిలో పోటీలో విజేతలుగా నిలిచే వాటి పేర్లను ప్రకటిస్తామని అన్నారు. ఈ
కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్, ఎంపీవో పావని, ఎంపీటీసీ లు సర్పంచులు, వెంకటేశ్వర్ రెడ్డి, బలరాం రెడ్డి పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.