హైదరాబాద్ : ఉద్యోగుల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ. 22,889 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ఎనలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఉద్యోగులను గౌరవిస్తూ 2014-15 బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్లే ఉద్యోగుల వేతనాల్ని సవరిస్తూ.. మునుపెన్నడూ, ఎవ్వరూ ఇవ్వనంత ఫిట్‌మెంట్(43 శాతం) ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ సాకారం కోసం ఉద్యోగులు పునరంకితం కావాలని సూచించారు. తమ ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల విశ్వాసం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంతో ఉద్యోగులదే కీలక పాత్ర అని చెప్పారు. ఉద్యోగులతో స్నేహ సంబంధాలను కొనసాగించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.





