జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవోలు)గా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ డీఈవోల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధూకర్ కు మండల కేంద్రంలోని ఆది వరహస్వామి ఆలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఈవోలు మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలకు సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎవరూ చేయని విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రారంభించడం సంతోషకర విషయం అన్నారు. ఈ కార్యక్రమం కోసం 100 రోజుల పని దినాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేటాయించిందని వివరించారు. కంటి వెలుగు కార్యక్రమం పూర్తయిన తర్వాత డీఈవోలుగా 34 మంది సేవలు వినియోగించుకుని తొలగించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నా పోస్టులలో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులలో తమ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డిఈఓలకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర సర్కారు చొరచూపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పడిన నాటి నుంచి డాటా ఎంట్రీ ఆపరేటర్ల నోటిఫికేషన్ రాలేదన్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. డిఈఓ సమస్యలను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓల సంఘం సభ్యులు సిద్ద వెంకటేశ్, దండె కృష్ణ, రమ్యశ్రీ, రజిత, సతీష్, కార్తీక్ పాల్గొన్నారు.




