ఉధృతమవుతున్న రైతాంగ ఉద్యమం

– జాతీయ రహదారుల దిగ్బంధం

– ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరు

దిల్లీ,డిసెంబరు 11 (జనంసాక్షి):దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు అమృత్‌సర్‌ నుంచి కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీకి చెందిన రైతులు 700 ట్రాక్టర్లలో దిల్లీకి తరలివెళ్లారు. ఈ ట్రాక్టర్లు దిల్లీలోని కుండ్లీ సరిహద్దు వైపుగా వెళ్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశరాజధాని దిల్లీలో 16రోజులుగా వివిధ రాష్ట్రాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం దిల్లీ-హరియాణా సరిహద్దుల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు నాయకులు మాట్లాడారు. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే రైల్వే ట్రాకులపై బైఠాయిస్తామని హెచ్చరించారు. సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడిన రైతు నాయకులు డిసెంబరు 12లోగా అన్ని టోల్‌ప్లాజాలు మూసేస్తామన్నారు. దిల్లీకి వచ్చే అన్ని రహదారులు ముట్టడించి నిరసన ఉద్ధృతం చేస్తామన్నారు. కేవలం పంజాబ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అందరు రైతులు రైల్వేట్రాకులు నిర్బంధించాలని పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన తేదీ, తదితర వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. చట్టాలను వెనక్కి తీసుకొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న సవరణలన్నీ పాతవేనని, వాటి వల్ల ఉపయోగం లేదని వారు ఉద్ఘాటిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఆరు సార్లు చర్చలు జరిగినా ఫలితం రాలేదు. మరోవైపు టిక్రీ, ధన్సా సరిహద్దులు నిరసనలతో ఇప్పటికే మూతబడ్డాయి. జైపుర్‌-దిల్లీ సరిహద్దును కూడా రైతులు ముట్టడించారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు కొవిడ్‌-19 నేపథ్యంలో మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వ్యవసాయ చట్టాలపై సుప్రీంకు రైతులు

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై గత కొద్ది రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. నూతనంగా తీసుకొచ్చిన మూడు చట్టాల వల్ల కార్పొరేట్ల దోపిడీకి రైతులు బలయ్యే ప్రమాదం ఉందని బీకేయూ అధ్యక్షుడు భాను ప్రతాప్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ చట్టాలపై పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన 16వ రోజుకు చేరింది. చట్టాలపై గత బుధవారం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు తిరస్కరించిన రైతు సంఘాలు.. చట్టాలు రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి. అయితే కేంద్రం మాత్రం రద్దుకు అంగీకరించట్లేదు.

ఉద్యమం ఆపండి: తోమర్‌

మరోవైపు కేంద్రం ప్రతిపాదనలు పరిశీలించాలని గురువారం రైతులను కోరిన వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌.. నేడు మరోసారి అన్నదాతలకు అభ్యర్థనలు చేశారు. సామాన్య ప్రజల అవసరాల దృష్ట్యా ఆందోళన ఆపాలని కోరారు. ‘చర్చల తర్వాత చట్టాల్లో సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చట్టాల్లో అభ్యంతరాలుంటే వాటి పరిష్కారం కోసం సూచనలు ఇవ్వాలని రైతులను కోరాం. కానీ అన్నదాతలు అందుకు ఒప్పుకోవట్లేదు. రైతులు ఉద్యమం ఆపి చర్చలకు రావాలి. అన్నదాతలతో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని తోమర్‌ చెప్పుకొచ్చారు.

రైతుల సహనాన్ని పరీక్షించకండి: పవార్‌

రైతుల ఆందోళనపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు. వ్యవసాయ బిల్లులపై లోతైన చర్చలు చేపట్టాలని ప్రతిపక్షాలు కోరినప్పటికీ ప్రభుత్వం తొందరతొందరగా బిల్లులను పాస్‌ చేసిందని ఆరోపించారు. రైతుల సమస్యలపై కేంద్రం సానుకూల పరిష్కారం ఇవ్వకపోతే ఈ ప్రతిష్టంభన మరిన్ని రోజులు కొనసాగే అవకాశముందన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతు సహనాన్ని పరీక్షించడం మంచిది కాదని.. అలా చేస్తే ఇప్పుడు దిల్లీ సరిహద్దుకు పరిమితమైన ఆందోళనలు దేశమంతా పాకుతాయని శరద్‌ పవార్‌ హెచ్చరించారు.