సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 17 :-జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత రోజు రోజుకు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం నాడు ఒక ప్రకటనలో సూచించారు.
రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ, వడగాలులు వీస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అధిక జన సంచారం ఉండే ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, అంగన్వాడి కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని ఆయా అధికారులకు సూచించారు.
ఎండ తీవ్రత వల్ల ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పశువుల దాహార్తి తీర్చేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. హరితహారం లో నాటిన మొక్కల సంరక్షణకు క్రమం తప్పకుండా నీరు పోయాలన్నారు.
ముఖ్యంగా ఎండల ప్రభావంతో కలిగే నష్టాలు,ప్రమాదాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా శాఖల అధికారులు ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, చేతిరుమాలు, టవల్ వినియోగించాలని, బయటి పదార్థాలు తినరాదని ఎక్కువగా నీటిని త్రాగాలని, పళ్ళ రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటివి తీసుకోవాలన్నారు.
ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సకాలంలో చికిత్స పొందాలని, నిర్లక్ష్యం పనికిరాదని తెలిపారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఎండలో బయట తిరగవద్దని, వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుని వడ దెబ్బకు గురికాకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రజలు వీలైనంత వరకు పగటి పూట ఇంటి వద్దనే గడపాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావాలని కలెక్టర్ కోరారు.
జిల్లాలో ఎండల తీవ్రతకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తూ ప్రజలను జాగరూకులను చేయాలని కలెక్టర్ సూచించారు.





