Thursday, 5 November 2026

ఎజెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. అట్టహాసంగా ముత్యాల ముగ్గుల పోటీలు

యాదాద్రి భువనగిరి జిల్లా
(జనం సాక్షి)

ఎజెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. అట్టహాసంగా ముత్యాల ముగ్గుల పోటీలు..

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పురం గ్రామంలో ఎజెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రోజున ముత్యాల ముగ్గుల పోటీల వేడుకలను నిర్వహించారు. ఎజెఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి లలిత నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఉదయం ఆరు గంటల నుండే మహిళలు యువతులు భారీ సంఖ్యలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మైదానానికి చేరుకున్నారు.ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన ఈ ముగ్గుల పోటీలో రంగురంగుల ముగ్గులను వేసారు. ఇందులో ముఖ్యంగా చుక్కల ముగ్గులు, ప్రకృతి పరమైనవి,సందేశాలు ఇచ్చేవి తదితర ముగ్గులను పరిగణలోకి తీసుకొని ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు నాలుగవ ఐదవ బహుమతులను ఎలిమినేటి జంగారెడ్డి లలిత చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ప్రధమ బహుమతిని వట్టిపల్లి నవనీత,ద్వితీయ బహుమతిని బండారు మనీషా,తృతీయ బహుమతిని బొడ్డుపల్లి స్రవంతి,నాలుగవ బహుమతిని శ్యామల జ్యోతి, ఐదవ బహుమతిని పుష్ప గెలుపొందారు. ప్రథమ బహుమతికి ఐదు వేల నూట పదహారు, ద్వితీయ బహుమతికి నాలుగు వేల నూట పదహారు, తృతీయ బహుమతికి మూడు వేల నూట పదహారు, నాలుగవ బహుమతికి రెండు వేల పదహారు, ఐదవ బహుమతికి వెయ్యి నూట పదహారు నగదు బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా ఎజెఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి మాట్లాడుతూ..ముగ్గుల పోటీలు సాంప్రదాయాలకు, సంస్కృతిలకు ప్రతీకలని అన్నారు. మహిళలు ఉదయం పూట ముగ్గులు వేయడం వలన మంచి వ్యాయామంతో పాటు మహిళ యువతులలో సృజనాత్మకత పెరుగుతుందని వారు పేర్కొన్నారు. ముగ్గుల పోటీలు ఐక్యతకు, ఆప్యాయతకు నిదర్శనమని ఈ సందర్భంగా వారు తెలిపారు.

 

ముగ్గులు వేసేది దేవతలను ఆహ్వానించడానికే.. ఎలిమినేటి లలిత రెడ్డి.

 

మహిళలు తమ ఇళ్ళ ముందు ఆవుపేడతో కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసేది దేవతలను భువిపైకి ఆహ్వానించడానికేనని ఎజెఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి సతీమణి ఎలిమినేటి లలితా రెడ్డి అన్నారు. గురువారం రోజున ఎజెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు. సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు అని వారు అన్నారు. రంగురంగుల ముగ్గులు చుక్కల ముగ్గులు వేసే గొప్ప పండుగని వారు తెలియజేశారు. మహిళల కోసం ప్రత్యేక పండుగ కేవలం సంక్రాంతియేనన్నారు. ఈ పండుగను పహిల్వాన్ పురం గ్రామ మహిళలతోపాటు చుట్టుపక్కల గ్రామాల మహిళలు యువతలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఎజెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎలిమినేటి జంగారెడ్డి స్వగృహమున నిర్వహించిన ఈ ముత్యాల ముగ్గుల పోటీల మైదానం మహిళలు యువతులతో కోలాహాలంగా మారింది. ఈ కార్యక్రమంలో పచ్చిమట్ల మల్లేష్ గౌడ్, ఉపసర్పంచ్ బండారి నరేష్, పాల సంఘం చైర్మన్ రాయగిరి మల్లేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి బద్దం భాగ్యమ్మ,మాజి ఎంపిటిసి వనగంటి రమేష్, వార్డు సభ్యులు శ్యామల రమేష్, రేపాక రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కస్తూరి, ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, బొడ్డుపల్లి నాగరాజు, బహుమతుల సమావేశ ప్రాంగణ సభ తాత్కాలిక అధ్యక్షులు రాయగిరి కృష్ణస్వామి, శామల వెంకట్ రెడ్డి,ఎలిమినేటి వెంకటరెడ్డి,వనగంటి రాజేష్ రేపాక శ్రీనివాస్,వట్టిపల్లి లింగస్వామి గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.