ఎన్నికల నిర్వహణలో సెక్టర్ అధికారుల పాత్ర కీలకం –

 

 అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
నల్గొండ బ్యూరో, జనం సాక్షి , అక్టోబర్ 11.
ఎన్నికల నిర్వహణలో సెక్టర్ అధికారుల పాత్ర కీలకమని   అదనపు కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్ రావు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశమందిరంలో మునుగోడ్ ఉప ఎన్నికల సెక్టర్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టర్ అధికారులు రిటర్నింగ్ అధికారి పరిధి లో విధులు నిర్వహించాలని, ఒక్కో సెక్టర్ అధికారికి 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలకు బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని, ఒక్కో సెక్టర్ అధికారికి ఒక రూట్ అధికారిని కూడా కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రతి సెక్టర్ అధికారి తన పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను కనీసం మూడు సార్లు సందర్శించాలని, పోలింగ్ కేంద్రాలలోని సౌకర్యాలపై నివేదికను సమర్పించాలన్నారు. అన్నారు.  పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి, పోలింగ్ కేంద్రం నుండి పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రానికి తరలించడానికి రూట్ ప్లాన్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. తమ సెక్టర్ పరిధిలో ఓటర్లకు ఈవీఎంల పై అవగాహన కల్పించడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పర్యవేక్షణ, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా చూసే బాధ్యత సెక్టర్ అధికారులది అని అన్నారు. మరీ ముఖ్యంగా సెక్టర్ అధికారులు ఈవీఎం మరియు వివిప్యాట్ లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈవీఎం బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి అయిన వెంటనే పోలింగ్ కొరకు ఈవీఎం లు, వివిప్యాట్ల ను సిద్ధం (కమీషనింగ్) చేసే బాధ్యత సెక్టర్ అధికారులదేనని అన్నారు. పోలింగ్ రోజు సైతం పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం, వివిప్యాట్లలో ఏవైనా సమస్యలు తలెత్తినపుడు, వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరించే బాధ్యత సెక్టర్ అధికారులది అని అన్నారు. పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతాన్ని రిటర్నింగ్ అధికారికి తెలపాలన్నారు. సెక్టర్ అధికారులందరూ ప్రిసైడింగ్ మరియు పోలింగ్ అధికారుల బాధ్యతను తెలుసుకొని ఉండాలనీ, అందుకే పోలింగ్ అధికారుల బాధ్యతలపై కూడా సెక్టర్ అధికారులకు శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ఆర్.డి.ఓ. జయ చంద్ర రెడ్డి, శిక్షణా నోడల్ అధికారి భిక్షపతి, మాస్టర్ ట్రైనర్ తరాల పరమేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail