ఎమ్మెల్సీ కవితకు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
– బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు వేమూరి సత్యనారాయణ డిమాండ్
మునగాల, మార్చి11(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు వేమూరి సత్యనారాయణ మునగాల మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షులు, పార్లమెంటు మెంబర్ గా ఉండి ఒక మహిళా ప్రజాప్రతినిదిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం అవమానకరమని, ఆర్ఎస్ఎస్ భావాజాలం, విలువలు, విశ్వసనీయతలు, సమాజహితం, సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నామన్న ఈ బీజేపీ నాయకులు.. సభ్య సమాజం తలదించుకునేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఇట్టి విషయంపై హైదరాబాదు నగర మేయర్ విజయలక్ష్మి మన రాష్ట్ర గవర్నర్ తమిళసైని కలసి వినతి పత్రం ఇవ్వాలని అపాయింట్మెంట్ కోరినా ఒక మహిళా ప్రజాప్రతినిధికి అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని, ఎక్కడ చీమ చిటుక్కుమన్నా స్పందించే గవర్నర్ ఇట్టి విషయంపై స్పందించాలని అన్నారు. ఇకనైనా బిజెపి నాయకులు మానవతా సిద్ధాంతాలకు లోబడి ప్రవర్తించాలని అన్నారు.