ఎల్లారెడ్డి అభివృద్దిలో ఏనుగుదే కీలక భూమిక
రైతులను అబివృద్ది చేసేందుకే అనేక పథకాలు
ప్రాసెసింగ్ యూనిట్లతో వారిని గట్టెక్కిస్తాం
ఎల్లారెడ్డి సభలో సిఎం కెసిఆర్ వెల్లడి
కామారెడ్డి,నవంబర్20(జనంసాక్షి): దేశమే ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని సీఎం కెసిఆర్ వెల్లడించారు. మిషన్ కాకతీయలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 457కి పైగా చెరువులు బాగు చేయించుకున్నరన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ సభలో సీఎం ప్రసంగిస్తూ..గజ్వేల్ నియోజకవర్గం కంటే ఎల్లారెడ్డిలో రవీందర్‌రెడ్డి ఎక్కువ చెరువులు అభివృద్ధి చేసుకున్నరని..ఆ గౌరవం వారికే దక్కిందని సీఎం చెప్పారు. మిషన్ కాకతీయ పథకాన్ని నగర్ మండలంలోని చెరువులో ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్బంగా సీఎం గుర్తు చేసుకున్నారు. గౌడ కులస్థులకు శాశ్వతంగా చెట్ల పన్ను రద్దయిపోయింది. నాయీ బ్రాహ్మణ, రజక సోదరులను కూడా ఆదుకునే కార్యక్రమాలు ప్రారంభమైనయి. 70 శాతం ప్రజానీకం వ్యవసాయాధారంగా బతికేవారే.. కరెంట్ ఎప్పుడు వస్తదో తెలియదు. ట్రాన్స్‌ఫార్మర్లు ఎప్పుడు కాలిపోతయో తెలియదు. ఇపుడు ఆ బాధలేమి లేకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుందని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతలేవని, కరెంట్ పోతలేదన్నారు. ఐటీ రంగం, పారిశ్రామిక రంగంలో ముందుకు పోతున్నం. ఆడబిడ్డలను ఆదుకున్నాం. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు పించన్ ఇస్తున్నం. మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తది. పెన్షన్ దారులందరికీ వెయ్యి పెన్షన్‌ను పెంచి 2,016 రూపాయలు అందజేస్తమన్నారు. మిషన్ భగీథ ద్వారా ఎల్లారెడ్డిలో అన్ని గ్రామాలకు నీళ్లు చేరాయని, నల్లాల కలెక్షన్లు ఇచ్చే పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రైతు బీమా దేశంలోనే ఎక్కడా లేదు. దేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా రైతు బీమా తీసుకొచ్చినం. ఏ పైరవీ లేకుండా ఏ అధికారి వద్దకు పోకుండా వారి ఖాతాల్లో బీమా సొమ్ము పడేలా చర్యలు తీసుకుంటున్నమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి ప్రజలు ఏనుగు రవీందర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో తనతో పాటే నడిచి పోరాటాలు చేసిన వ్యక్తిగా విూకు సుపరిచితుడన్నారు. ఈ సారి పోచారం కన్నా ఎక్కువ మెజార్టీ ఏనుగుకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి పోచారం, కెకె తదితరులు పాల్గొన్నారు.