ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా కృషి చేయాలి
జహీరాబాద్ డిసెంబర్ 23 (జనంసాక్షి ) కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా కృషి చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో మైపాల్ కు వినతిపత్రాన్ని అందజేశారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో ని ఎమ్మార్పీఎస్ నాయకులు సంగారెడ్డి కి బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతున్నది అందరికీ తెలిసింది అన్నారు. పండిట్ దీన్ దయాల్ అంత్యోదయస్ఫూర్తితో ఎదిగిన బిజెపి ప్రభుత్వం మొదటినుండి ఎమ్మార్పియస్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తూ వచ్చింది అన్నారు. గత 28 ఏళ్లుగా తెలుగు నేలపై జరిగిన ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బిజెపి మేనిఫెస్టోలో పెడుతూ వస్తున్నది అన్నారు. ఎమ్మార్పీఎస్ చేసిన ప్రతి ఉద్యమంలోనూ, నిర్వహించిన ప్రతి బహిరంగ సభ లోను బిజెపి పెద్దలు హామీలు ఇస్తూనే వస్తున్నారు. బిజెపి పెద్దలు ప్రతి సందర్భంలోనూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినారు అంతేకాకుండా బిజెపి పెద్దల అంతర్గత సమావేశంలో కూడా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని నిర్ణయించినట్లుగా వార్తలు ఆయా సందర్భాల్లో ప్రతి మీడియాలోనూ వస్తున్నాయి అని తెలిపారు. కేంద్రంలో గత 8 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి కూడా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో జాప్యం జరుగుతుండడం వల్ల మాదిగలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు అన్నారు. విద్యా ఉద్యోగాల్లో అనేకంగా నష్టపోతున్నారని, అందువల్ల ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం పెద్దలందరినీ ఒప్పించి పార్లమెంటు ద్వారా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాహాజన సోషలిస్ట్ పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ పొట్టోల వెంకటేశం, జిల్లా కో కన్వీనర్లు కాడనల్లో సుదర్శన్, అబ్రహం మాదిగ , జహీరాబాద్ నియోజకవర్గం నాయకులు జయరాజ్, హత్నూర కో కన్వీనర్ గంధ గల వీరయ్య, బుచ్చయ్య సదాశివపేట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




