Friday, 6 November 2026

ఏపీ డీజీపీ ఆఫీసులో లొంగిపోయిన అవినాష్‌

హోం మంత్రి పేరుతో దందాలకు పాల్పడ్డ అవినాష్‌

హైదరాబాద్‌, మార్చి 12: ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి చిన రాజప్ప బంధువునంటూ మోసాలకు పాల్పడిన అవినాష్‌ గురువారం డీజీపీ కార్యాలయంలో లొంగిపోయాడు. ఓ మీడియా సంస్థ వాహనంలో వచ్చిన అవినాష్‌ అడ్వకేట్‌ సహాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మొదటగా అవినాష్‌ డీజీపీని కలవడానికి ప్రయత్నించగా కుదరలేదు.

దీంతో అవినాష్‌ ఈ కేసును టేకప్‌ చేసిన ఐజీ అర్జున్‌ సింగ్‌ వద్దకు వెళ్లి తాను పారిపోవడానికి గల కారణాలు, తాను చేసిన దందాలు, తదితర విషయాలను వివరించాడు. అనంతరం ఐజీ కాకినాడ పోలీసులకు సమాచారం ఇచ్చి అవినాష్‌ను తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు.

హ్యూమన్‌ రైట్స్‌ పేరుతో అవినాష్‌ నకిలీ ఐడీ కార్డులను సృష్టించి అనేక మందికి పంచి ఇచ్చాడు. మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా చెలామణి అవుతూ ఎన్నో దందాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా హోం మంత్రి చినరాజప్ప పేరు చెప్పుకుని అనేక దాడులకు, బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవినాష్‌ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అతనిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. అతని అవినీతి, అక్రమాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *