Thursday, 5 November 2026

ఒక్క దళిత కుటుంబానికైనా దళిత బంధు ఇచ్చారా బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు

జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండలంలో ఏ ఒక్క దళిత కుటుంబానికైనా దళిత బంధు కింద పది లక్షల సహాయాన్ని అందజేశారా..?అని అధికార పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు ప్రశ్నించారు. మండలంలోని పేరపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి..ఈ ఉత్సవాలు జరిగే క్రమంలో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతుందని, ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఆనాడు త్యాగమూర్తి సోనియా గాంధీ అదేవిధంగా మంథని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వ్యవహరించిన తీరు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆధారంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చరిత్రను ఎవరు మార్చిన మారదని అన్నారు. తెలంగాణ పదం ఉన్నంతకాలం శ్రీధర్ బాబు పేరు చిరస్థాయిగా ఉంటుందని, ఇందుకు కారణమైన మంథని నియోజక వర్గ వాసుల పేరు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి పుట్ట మధుకు పునర్జన్మనిచ్చినటువంటి కమాన్పూర్ మండలాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తున్నాడని దళిత బంధు పథకం ప్రారంభమై సంవత్సరం నర గడిచినప్పటికీ కూడా కమాన్పూర్ మండలంలోని ఏ ఒక్క దళితునికి 10 లక్షల రూపాయలు ఇవ్వలేదని, కమాన్పూర్ మండలంలోని ఏ ఒక్క దళితునికి మూడెకరాల భూమి ఇవ్వలేదని, కమాన్పూర్ మండలంలోని ఏ ఒక్క కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, మైనార్టీ లోన్ల పేరుతో పోయిన సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క మైనార్టీ సోదరునికి లోన్ ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు కొత్తగా కులవృత్తుల పేరుతో దగా చేస్తున్నారని 4000 నుండి 5 వేల దరఖాస్తులు కులవృత్తుల పేరు మీద వస్తాయని వీరిలో కనీసం 1000 మంది కన్నా ఇస్తారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తొగరి అన్నపూర్ణ అశోక్, జిల్లా నాయకులు గాండ్ల మోహన్, మాజీ కో ఆప్షన్ అబ్దుల్ రఫిక్, మాజీ సర్పంచ్ దాసరి గట్టయ్య, కాంగ్రెస్ పెంచికల్పేట్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇరుగురాల శేఖర్, నాయకులు భూసా తిరుపతి, బొజ్జ సతీష్, మామిడి రాజు, పెద్ద సంఖ్యలో పేరపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.