◆◆◆ కోటి ఉద్యోగాల కల్పన హామీ ఏమైంది…..?
◆◆◆●మాట తప్పిన వారెవరు…..?
భారత రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు
మానకొండూరు, ఆర్ సి, జనవరి 19( జనం సాక్షి)
తెలంగాణ ప్రభుత్వం ప్రజలతో చెలగాటమాడుతుందని, ముఖ్యమంత్రి పై, కేసీఆర్ కుటుంబం పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ, హామీలు వాగ్దానాలు నెరవేర్చలేదని భాజపా జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు మండిపడ్డారు. మాట తప్పిన వారెవరు మీరా మేమా అని సూటిగా ప్రశ్నించారు. నల్లధనం వెలికి తీస్తామని, జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని, కోటి ఉద్యోగుల కల్పన హామీ ఏమైంది అని మీడియా సాక్షిగా నిలదీశారు. ఓట్ల కోసం కాదు అభివృద్ధికి పాటుపడాలని, భాజపా నాయకులకు సూచించారు. భారత రాష్ట్ర సమితి ప్రభంజనాన్ని చూసి భాజపా నాయకుల్లో వణుకు మొదలైందని, అందుకే అర్థంపర్థం లేని ఆరోపణలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు పెద్దపీట వేశామని షాది ముబారక్, విదేశీ విద్యా పథకం కింద 20 లక్షల రూపాయలు అందించడమే కాక విమాన టికెట్ కోసం 75 వేల రూపాయలు, మసీదుల్లో ఇమాముల కోసం ఐదువేల రూపాయలు అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. మైనార్టీలకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించామని ఉప ముఖ్యమంత్రి ,డిప్యూటీ మేయర్, మేయర్ తదితర ఉన్నత స్థానాల్లో మైనార్టీలకు సముచిత స్థానం దక్కిందన్నారు. కళ్ళు లేని కబోదుల్లా వ్యవహరించకుండా వాస్తవ విషయాలను గ్రహించి మాట్లాడాలని భాజపా నాయకులకు చురకలటించారు. భాజపా నాయకులకు తెలంగాణ రాష్ట్రంపై తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని తేల్చి చెప్పారు. అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. గురువారం మానకొండూరులోని జీవి ఆర్ క్యాంపు కార్యాలయంలో జడ్పీటీసీ తాళ్ల పెళ్లి శేఖర్ గౌడ్, ముంజంపల్లి సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, ఎంపీటీసీలు పిట్టల కవిత మధు, ఉండుంటి సులోచన శామ్సన్, మానకొండూరు మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు పడాల సత్యనారాయణ గౌడ్, నాయకులు శాతరాజు యాదగిరి, పార్నంది కిషన్, పిండి సందీప్ తదితరుల తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రానికి రావలసిన వనరులను, నిధులను నిలిపివేసి భాజపా ప్రభుత్వ మాట తప్పిందని ఆరోపించారు. ఎదుటివారిని విమర్శించే ముందు తన పరిధి ఏమిటో గమనించాలని ఒక వేలు ఎదుటివారిని చూపిస్తే మరో నాలుగు వేళ్ళు మన వైపే చూపిస్తాయనే విషయం గమనించాలని గంగారెడ్డికి సూచించారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి ప్రచారం చేయాలని భాజపా నాయకులు మాట్లాడటం పై ఆయన తీవ్రస్థాయిలో ఆక్షేపణ తెలియజేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐటీ సంస్థల్లో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇందుకుగాను గోల్డ్ ఐకాన్ డిజిటల్ ఇండియా అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల్లో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ప్రవీణ్ పవార్ అవార్డును అందించారని వివరించారు. గ్రీన్ చాలెంజ్ అవార్డు, హరితహారం లో భారతదేశంలోనే తెలంగాణ కు మొదటి స్థానం దక్కిందని గుర్తు చేశారు. 20 22 సంవత్సరంలో ఓల్డ్ గ్రీన్ సిటీ అవార్డు, ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర పథకం మిషన్ భగీరథకు గాను గజేంద్ర సింగ్ శకావత్ ఈ అవార్డు ఇచ్చారని, స్వచ్ఛ సర్వేక్షన్ లో తెలంగాణ రాష్ట్రం నుండి 16 మున్సిపాలిటీలకు సముచిత స్థానం దక్కిందని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో 35 శాతం రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందని వివరించారు. ఐటీ సెక్టర్లో హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో ఉందని ఈ విషయాలన్నీ భాజపా నాయులు గ్రహించాలని సూచించారు. 19 రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉందని అందులో ఏ రాష్ట్రానికి ఇన్ని అవార్డులు దక్కాయో భాజపా నాయకులు బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. హరితహారం కార్యక్రమం లో 2004 కోట్ల మొక్కలు నాటిన ఘనత తెలంగాణ రాష్ట్రం దేనన్నారు. విమర్శలుమాని అభివృద్ధిపై దృష్టి సారించాలని భాజపా నాయకులకు రామకృష్ణారావు హితువు పలికారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు ఎన్ని ప్రాజెక్టులు మంజూరు చేయించారొ బహిర్గత పరచాలని ఆయన మీడియా సాక్షిగా సవాలు విసిరారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే భాజపా ధ్యేయమని ఆరోపించారు. తక్షణం గంగాడి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిలు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రశంసించారని వివరించారు .




