Wednesday, 4 November 2026

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్ సూర సమ్మయ్య

జనంసాక్షి, కమాన్ పూర్ : పాలకుర్తి మండలం గన్ శ్యాం దాస్ నగర్ గ్రామంలో కంటి వెలుగు ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూర సమ్మయ్య అన్నారు. సోమవారం గన్ శ్యామ్ దాస్ నగర్ గ్రామంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్,కెశోరాం కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య మాట్లాడుతూ.. అంద రహిత సమాజం నిర్మాణం కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలను ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో, నిర్వహించి వారికి మందులను కళ్ల అద్దాలను అందజేస్తున్నామన్నారు. ప్రజలు ఎవరు కూడా కంటి సమస్యలతో బాధపడవద్దనే ముఖ్య లక్ష్యంతో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్ సైతం చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ షబ్బీర్,ఎంపీటీసీ బండారి శ్రీవాణి, ఉపసర్పంచ్ రెడ్డపక వసంత మల్లేష్, వార్డు సభ్యులు భూపెళ్లి సాగర్,సంపంగి కుమార్,బుర్ర పరిశురాం గౌడ్,గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ ప్రజలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.