Monday, 2 November 2026

కందుల నిల్వకు సరిపోని గోదాములు

ముందుచూపు లేకపోవడంతో సమస్య

ఆదిలాబాద్‌,మార్చి1(జ‌నంసాక్షి): గోదాముల సౌకర్యం లేకపోవడం కారణంగా కందుల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను పక్కన పెట్టి చూపడంతో ప్రైవేట్‌ వ్యాపారులు ఇదే అదనుగా రైతుల నుంచి తక్కువ ధరలకు కందులు కొనుగోళ్లు చేస్తున్నారు. జిల్లాలో పండే కంది పంటను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా కనీస జాగ్రత్తలు పాటించినట్లైతే ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కావని రైతులు అంటున్నారు. ఇక్కడి గోదాములు నిండిపోవడంతో నిజామాబాద్‌కు కందులను రవాణా చేయడానికి అనుమతి ఇవ్వాలని మార్క్‌ఫెడ్‌ అధికారులు గతేడాది ప్రభుత్వానికి లేఖ పంపారు. ఇప్పటికే గోదాములు నిండిపోవడంతో ఆరుబయటనే నిల్వ చేసుకోవాల్సి వచ్చింది. మార్కెట్‌లో నిల్వలు అక్కడే ఉండి పోయాయి. కొనుగోలు చేసిన కందులను నిల్వ చేసుకోవడంలో అధికారులకు ముందు చూపులేకుండా పోయింది. ఇతర జిల్లాల నుంచి వచ్చే కందులను ఆదిలాబాద్‌ గోదాముల్లో నిల్వ చేయడంతో ఇక్కడ కొనుగోలు చేసిన కందుల నిల్వకు చోటు కరవైంది. కొనుగోలు చేసిన కందులను నిల్వ చేసుకునే విషయంలో అధికారులకు.. పాలకులకు ముందు చూపులేకుండా పోయింది. వాస్తవానికి జిల్లాలో కొనుగోలు

చేసే పంటను నిల్వ చేసుకునే అంత సామర్థ్యం కలిగిన గోదాములు లేవు. 25వేల మెట్రిక్‌ టన్నుల కందిపంట దిగుబడి వచ్చే అవకాశం ఉండగా .. 20వేల మెట్రిక్‌ టన్నులను మాత్రమే నిల్వ చేసుకునే వీలుంది. నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ వంటి ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన కందులను కూడా ఆదిలాబాద్‌ పట్టణంలోని సీడబ్ల్యూసీ గోదాముల్లోనే నిల్వ చేశారు. అధికారులు.. రవాణ గుత్తేదారులు సిండికేట్‌గామారి భారీ అవినీతికి తెరలేపారు. ప్రభుత్వం రవాణ ఖర్చుల కింద 0కి.విూ నుంచి

16కి.విూ వరకు రూ.1.70టన్నుకు చెల్లిస్తుంది. 16కి.విూకి మించి రవాణ చేయాల్సి వస్తే ప్రతి కి.విూకు రూ.2.78చొప్పున ధర నిర్ణయించారు. రవాణ గుత్తేదారులకు మేలు చేసే విధంగా కందుల కొనుగోలు కేంద్రాలకు సవిూపంలోనే గోదాములున్నా.. దూరప్రాంతాలకు తరలిస్తున్నారు.అంతేకాకుండా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఉన్న గోదాములను పత్తి నిల్వలకు అద్దెకు ఇచ్చేసి ఇప్పుడు వెతుకులాడటం మరింత విచిత్రంగా ఉంది. అన్ని చోట్లా మార్కెట్‌ యార్డుల్లో కొత్తగా గోదాములు నిర్మించినా.. వాటిని ఉపయోగించ కుండా రవాణ ఖర్చులు పెంచేలా చేసి ప్రభుత్వంపైన భారం మోపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 25వేల మెట్రిక్‌ టన్నులకు పైగా కంది పంట దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కొనుగోలు చేసిన కందులను సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాముల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌ పట్టణంలో 20వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ చేసుకునే గోదాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో వైపు గన్నీ సంచులు లేక కందుల కొనుగోళ్లు ప్రశ్నార్థకంగా మారగా, కొనుగోలు చేసిన కందులను నిల్వ చేసుకోవడానికి జాగ లేకుండా చేసుకున్నారు. ఇప్పటికే సీడబ్ల్యూసీ గోదాము నిండిపోవడంతో ఆరుబయటనే నిల్వ చేశారు. ఇలా చేయడం వల్ల సకాలంలో కొనుగోళ్లు లేక రైతులు నానాయాతన పడుతున్నారు.