– కబ్జాలు షరా మాములే.
– అక్రమ నిర్మాణాలు అంతా ఓపెన్ సీక్రెట్.
– తప్పు అధికారులదా?
– ప్రజాప్రతినిధులదా?
– కబ్జా పల్లి నియోజకవర్గంలో ఎందుకీ పరిస్థితి?
బెల్లంపల్లి, మార్చ్ 26, (జనంసాక్షి )
మంచిర్యాల జిల్లా కబ్జా పల్లి నియోజకవర్గంలో అక్రమాలకు అంతులేకుండా పోతుంది. ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు మిన్నకుండి పోతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమ పని కాదన్నట్టుగా కళ్ళు మూసుకుంటున్నారు. ఇదంతా చూస్తే నియోజకవర్గం అసలు పేరు బెల్లంపల్లి అని మర్చిపోయి కబ్జా పల్లిగా రూపాంతరం చెందింది. నియోజకవర్గంలో కబ్జాలు కామన్, అందులో అక్రమ కట్టడాలు అంటే వెరీ కామన్ అనే చందగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో 24 గంటలు జన సంచారం ఉండే ప్రాంతంలో అక్రమంగా ఏకంగా డజను షటర్లు అక్రమంగా నిర్మించారు అంటే మాములు మాటలు కాదు. కానీ ఈ కబ్జాపల్లి నియోజకవర్గంలో షరా మాములే అనే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహారిస్తున్నారు. యధా రాజా తధా ప్రజా అనే చందంగా ప్రజాప్రతినిధులు ఎలా అయితే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారో అలాగే ప్రజలు కబ్జాలకు అలవాటు పడి పోతున్నారు. ఈ నియోజకవర్గంలో పైసా ఉన్నవాడికే అందరు సపోర్ట్ చేస్తున్నారు. పైసా లేని నిరుపేద మాత్రం తరతరాలుగా వచ్చిన భూమిని కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టడుతున్నాడు. తాజాగా బెల్లంపల్లి పట్టణం కూరగాయల మార్కెట్ సమీపంలో కోట్లాది రూపాయల విలువైన భూమి కబ్జా రాయుళ్ల చేతుల్లో బందీ అయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో చూపరులకు కనబడకుండా ఏకంగా డజను షటర్లు ప్రత్యక్షం అయ్యాయి. దగ్గరి నుంచి చూస్తే గాని అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయి అనే విషయమే తెలియనంతగా చిన్నచిన్న పరదా దుకాణాల మద్య ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. కూరగాయల మార్కెట్ నూతనంగా ఏర్పాటు చేస్తున్నందున దానికి అభిముఖంగా ఉన్న సింగరేణి స్థలాన్ని తాత్కాలిక గోడలు ఏర్పాటు చేసి లోపల జరుగుతున్న అక్రమ నిర్మాణాలు కనబడకుండా చేసి ఇప్పటికి అయితే డజను వరకు దుకాణాల షటర్లు ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో డజను షాపింగ్ దుకాణాలు ఏర్పాటు అయినా ఇంకా అధికారులు తమకు తెలియదు అన్నట్టు వ్యవహారిస్తున్నారు కబ్జాపల్లి నియోజకవర్గ అధికారులు. అసలు వారికీ తెలియకుండా చీమ కూడా చిట్టుక్కు మనదు అనే పేరున్న అధికారులు కోట్లాది విలువ గల భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ఎందుకు నిమ్మకు నిరీత్తినట్లు వ్యవహారిస్తున్నారో అందరికి అర్థం అయిందని అనుకుంటున్నాము. అధికారులు మరీ ఇంతలా బరితెగిస్తుంటే అక్రమార్కులు మాత్రం ఏం చేయగలరు. వారు అడిగిన మాములు ఇవ్వడం తప్పించి. ఇంతే కాకుండా ఇంక్లైన్ బస్తీ మూల మలుపు వద్ద కూడా తాత్కాలిక గోడలు వాడి పేదల భూమిని కబ్జా చేసేశారు. ఇంకా సింగరేణి భూములు, క్వార్టర్లు గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. శితిలావస్థలో ఉన్న సింగరేణి క్వార్టర్లు సైతం కబ్జాకు గురై పెద్దల చేతిలో బందీగా ఉన్నాయి. పెద్దలు కబ్జా చేస్తే ఒప్పు, పేదలు కబ్జా చేస్తే తప్పు అనే చందంగా కబ్జాపల్లి నియోజకవర్గం మారింది. నిజానికి నియోజకవర్గం అసలు పేరుకన్నా కొసరు పేరుతోనే నియోజకవర్గం ముందుంది. ఇట్టి అక్రమ కట్టడాల వెనక ఓ ప్రజాప్రతినిధి ఉన్నట్లు సమాచారం. ఆయన జోలికి ఎందుకు వెళ్లడం అని అధికారులు మిన్నకుండి పోతున్నారని పట్టణ వాసులు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ స్పందిస్తారో, నియోజకవర్గం పేరు చిరకాలం నిలబెడుతారో కాలమే సమాధానం చెప్తదో, నియోజకవర్గ ప్రజలే సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే.
కబ్జా(బెల్లం)పల్లిలో అంతా అక్రమమే అయినా అది సక్రమమే.




