కరోనాతో పోరాడుతున్న వైద్యులకు జీతాలు ఇవ్వరా?

నగరపాలక సంస్థ తీరుపై మండిపడ్డ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  కోవిడ్‌-19 మహమ్మారిపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులకు జీతాలు చెల్లించకపోవడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది నెలలుగా కొందరు మునిసిపల్‌ డాక్టర్లకు జీతాలు చెల్లించకపోవడంతో వారు ధర్నా చేస్తున్నారని, ఇది మనందరికీ సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాజకీయాలు చేయరాదన్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనంతగా నగర పాలక సంస్థలో కొరత ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ (ఎన్‌డీఎంసీ) నిర్వహిస్తున్న ఆసుపత్రులలోని సీనియర్‌ డాక్టర్లు సోమవారం సామూహిక కాజువల్‌ లీవ్‌ పెట్టిన సంగతి తెలిసిందే. సవిూప భవిష్యత్తులో పరిష్కారం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. మునిసిపల్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌ఆర్‌ గౌతమ్‌ సోమవారం మాట్లాడుతూ, తమ డిమాండ్లు నెరవేరకపోతే తాము మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తామని చెప్పారు. హిందూ రావు ఆసుపత్రిలోని ఐదుగురు రెసిడెంట్‌ డాక్టర్లు శుక్రవారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. తమ పెండింగ్‌ జీతాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ సమస్యను ఎవరూ పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.