హైదరాబాద్: కలలు గనండి సాకారం చేసుకోండంటూ మిస్సైల్‌మ్యాన్ అబ్దుల్‌కలాం యువతకు గొప్ప మంత్రోపదేశం చేశారని, ఆయన జీవితం విద్యార్థులకు స్ఫూర్తిసంతకమని తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూధనాచారి అన్నారు. అత్యున్నతపదవి అధిష్టించినప్పటికీ నిరాడంబర జీవితం గడిపిన ఆయన గొప్ప మానవతావాదని అభివర్ణించారు. రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి ‘ఇంటర్-లింగ్యుల్ లిటరరీ, కల్చరల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ ’ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షుడు, విద్యానిపుణుడు డాక్టర్ వెల్చాల కొండలరావు రచనలు రసోక్తులు, నా సంపాదకీయాలు, స్టైట్ ఫ్రం ద హార్ట్, భావాలు బంగారాలు, నా సాహిత్య వ్యాసాలతోపాటు సలాం టు యు డాక్టర్ కలాం పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ మాట్లాడారు. భారతదేశ కీర్తిని ప్రపంచపటంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత కలాంకే దక్కుతుందన్నారు. అంతటి మహనీయుడి జీవితాన్ని యువతకు చేరువ చేసేందుకు ఈ పుస్తకం ఉపకరిస్తుందన్నారు. కలాం అంటే కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదని కష్టపడేతత్వం, క్రమశిక్షణ, కాల్పనికశక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ కలాం మరణం తర్వాత దేశవ్యాప్తంగా పెల్లుబుకిన స్పందనకు ప్రధాన కారణం ఆయన సున్నితత్వం, మానవతావాదిగా వ్యవహరించిన తీరేననన్నారు. అణ్వాయుధాలను తయారుచేస్తూనే మరోవైపు సమాజం మరచిపోతున్న మానవీయ విలువలను చేరువ చేయటంలో కలాం విజయం సాధించారన్నారు. అవే ఆయన్ని ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిపాయన్నారు.
ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ కొండలరావు తన రచనలతో ప్రజలకు విశ్వజనీనమైన ప్రేమను పంచాలనుకోవటం ముదావహం అన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేకమైన శైలితో రూపుదిద్దుకున్న కొండలరావు రచనలు సామ్యవాదం, సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా ఉంటాయన్నారు. గురజాడ, శ్రీశ్రీ, శేషేంద్రశర్మ వంటి మహనీయుల ప్రభావం ఈ రచనల్లో ప్రస్ఫుటమవుతుందన్నారు. ఉత్సాహభరితంగా సాగిన కార్యక్రమంలో ఇఫ్లూ ఉపకులపతి సునయినసింగ్, మెట్రోరై ఎండీ ఎన్వీ ఎస్.రెడ్డి తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఐఅండ్ పీఆర్ డైరెక్టర్ వి.సుభాష్, ప్రొఫెసర్ సి.సుబ్బారావు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘవేంద్ర, యు.ఆత్రేయశర్మ తదితరులు పాల్గొన్నారు.పుస్తకావిష్కరణ సందర్భంగా వివేకానంద రెసెడెన్షియల్ స్కూల్(కరీంనగర్) విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కృష్ణం వందే జగద్గురుం నృత్య ప్రదర్శనలో దశావతారాలను చిన్నారులు ఆవిష్కరించారు.




