తన స్టైల్ తనదేనన్న జానా
హైదరాబాద్,ఫిబ్రవరి25 (జనంసాక్షి) : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీఫామ్‌లు తీసుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నుంచి రవికుమార్ గుప్తా బీఫామ్ అందుకోగా, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నుంచి తీన్మార్ మల్లన్న అందుకున్నారు. వీరికి గాంధీ భవన్‌లో ఏఐసీసీ నేత కుంతియా బీఫామ్లు అందించారు. సందర్భంగా కుంతియా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ పాలనలో విఫలమయ్యాయని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రజలకిచ్చిన హావిూలపై ప్రజలను మభ్యపెడుతున్నాయని, మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ వాస్తవాలను గమనించి ప్రజలు కాంగ్రెస్ తరుఫున బరిలోకి దిగుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన స్టైల్లో తాను వ్యవహరిస్తానని, తనను వేరొకరితో పోల్చడం తగదని అసెంబ్లీలో విపక్షనేత జానారెడ్డి అన్నారు. తన స్థాయికి తగినట్లు హుందాగా వ్యవహరిస్తానని, ప్రభుత్వంపై తనది మెతక వైఖరి అనడం సరికాదని చెప్పారు. ఎవరి కోసమో తాను దూకుడుగా వ్యవహరించబోనన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్, ఛైర్మన్ స్పందించాలని, దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామని జానారెడ్డి అన్నారు. సీఎల్పీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.




