హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని తమ ఉద్యమం ఉంటుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. సమరదీక్ష ప్రాంగణం నుంచి ఆయన మాట్లాడారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజలకు తెలియపరుస్తామని చెప్పారు. గ్రామాల పొలిమేర్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు వ్యతిరేకంగా బ్యానర్లు కట్టాలని తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజల బాధలు మంత్రులకు పట్టటం లేదా అన్ని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమక్షేత్రంలోకి రావాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.




