Friday, 6 November 2026

కాంగ్రెస్‌, బిజెపి ప్రముఖులతో నిండిన అసెంబ్లీ విఐపి గ్యాలరీ

సుప్రీం ఆదేశాలతో కర్నాటక అసెంబ్లీ వ్యవహారాలు ప్రత్యక్షప్రసారం
యెడ్యూరప్ప రాజీనామా ప్రకటనతో ఆనందంలో కాంగ్రెస్‌,జెడిఎస్‌ నేతలు
బెంగుళూరు,మే19( జ‌నం సాక్షి): కన్నడనాట పరిణామాలు దేశం యావత్తూ ఆసక్తిగా చూసింది. లైవ్‌ ప్రసారం చేయాలని సుప్రీం ఆదేశించిన దరిమిలా దేశప్రజలు టివీల ద్వారా వ్యవహారాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఇకపోతే  కర్నాటక విధాన సౌధలోని విజిటర్స్‌ గ్యాలరీ హేమాహేవిూలతో నిండిపోయింది. బలపరీక్ష ఘటనను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. వీఐపీ గ్యాలరీలో కేంద్ర మంత్రలు అనంతకుమార్‌, సదానందగౌడ, కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున్‌ ఖర్గే, గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌లు ఉన్నారు. బీజేపీ నుంచి కూడా పెద్ద నేతలు వచ్చారు. శోభా కరాండలే, ప్రహ్లాద్‌ జోషిలు వీఐపీ లిస్టులో ఉన్నారు. బలపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్‌ జరుగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన సభలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష తిర్మానంపై ప్రసంగిస్తూ.. మా దగ్గర 104 మంది ఎమ్మెల్యేల మాత్రమే ఉన్నారు కాబట్టి బలపరీక్షలో విఫలమయ్యామని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తరవాత ఆయన తన సీఎం పదవికి రాజనీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో  అసెంబ్లీలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ నేతలు సంబరాలు చేసుకున్నారు. సంఖ్యాబలం సాధించడంలో బిజెపి విఫలమయ్యిందని  సంతోషం వ్యక్తం చేసారు.  బీజేపీ నాయకురాలు శోభా కరంద్లజ్‌ అన్నట్టే జరిగింది. నిజంగానే అద్భుతం. ఎన్నో నాటకీయ పరిస్థితులు, మరెన్నో ఎత్తులకు పైఎత్తులు జరిగినప్పటికీ ఎట్టకేలకు కాంగ్రెస్‌-జేడీయూలే అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. బలపరీక్షలో బలం నెగ్గించుకుంటామంటూ చివరి వరకు చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ, చివరికి చేతులెత్తేసింది. బలపరీక్షకు ముందే తన ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసేశారు. తమకు బలం లేదంటూ చెప్పకనే చెప్పేసి, బలపరీక్షకు వెళ్లకుండానే బయటికి వచ్చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకురాలు శోభా ముందే ఊహించి ఉన్నారేమో. రాజకీయాల్లో ప్రతి నిర్ణయం అద్భుతం, సంతోషమంటూ ఆమె చెప్పారు. నిజంగానే చివరి క్షణంలో యడ్యూరప్ప అద్భుతం చేసి చూపించారు. మరోవైపు బీజేపీ ప్రలోభాలకు ఆకర్షితులైనట్టు భావించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రతాప్‌ గౌడ పాటిల్‌, ఆనంద్‌ సింగ్‌లు కూడా చివరి నిమిషంలో తమ సొంత పార్టీలోకి వచ్చేశారు. వీరు శాసనసభలోకి ప్రవేశించేటప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ చుట్టుముట్టారు. బలపరీక్షలో కాంగ్రెస్‌కే ఓటు వేసేలా వీరిని సన్నద్ధం చేశారు. కానీ చివరికి బలపరీక్షే
జరుగలేదు. ఏది ఏమైనప్పటికీ నిజంగానే ఇది కాంగ్రెస్‌-జేడీఎస్‌లకు అద్భుతమనే చెప్పవచ్చు. ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించి కర్ణాటక అసెంబ్లీ పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హైడ్రామాకు చెక్‌ పడింది. యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి మూడున్నాళ్ల ముచ్చటగానే నిలిచింది. యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతల్లో సంబురాలు నెలకొన్నాయి. యడ్యూరప్పకు సభలో ప్రతి ఒక్కరూ షేక్‌ హ్యాండు ఇచ్చారు.
కర్ణాటకలో ప్రజాస్వామ్య విజయం: ఆజాద్‌
కర్ణాటకలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. విశ్వాస పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. ‘మాకు 117 మంది సభ్యుల బలం ఉంది. భాజపాకు మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించారు. భాజపా నేతల ప్రలోభాలను మా ఎమ్మెల్యేలు తిరస్కరించారు. ఇది ప్రజాస్వామ్య విజయం.’ అని అన్నారు.