జనంసాక్షి ,మంథని : ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో కనుమరుగు కాక తప్పదని మంథని నియోజకవర్గ భిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.
మంథని పట్టణంలోని రాజగృహాలో ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్‌ఎస్‌పార్టీలో చేరారు. పారుపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్లన్నతో పాటు తిరుపతి, రవీందర్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లోచేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వనించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, స్థానిక నాయకుల వ్యవహరశైలి నచ్చక పార్టీ వీడితే కార్యకర్తలను, నాయకులను అవమాన పరుస్తున్నారని, ఇటీవల మల్హర్ మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరితే మరుసటి రోజున ఆ నాయకుడికి పార్టీ సభ్యత్వం లేదని ప్రకటన చేశారని, ఇదే కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు. పార్టీ జెండా మోసినన్న రోజులు మనతో సేవలు చేయించుకుంటారని, పార్టీ వీడితే మాత్రం మా పార్టీ కాదని బురదజల్లే ప్రయత్నం చేస్తారని అన్నారు. అయితే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ అవసరమని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ది, సంక్షేమం సాధ్యమని ఆలోచన చేసి అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరుతున్నారని ఆయన వివరించారు. మంథని నియోజకవర్గంలో అనేక ఏండ్లు మన ఓట్లతో అధికారం చేపట్టి వివిధ ఉన్నత పదవుల్లో ఉన్నా కనీసం ఈ ప్రాంత అభివృద్ది చేయాలని, ప్రజలకు కనీస సేవలు అందించాలని ఆలోచన ఏనాడు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు మనకు చీకటే మిగులుతుందని, రాజిరెడ్డి చెప్పినట్లుగా కాంగ్రెస్‌లో కార్యకర్తగా పనిచేస్తే బానిసత్వమే మిగులుతుందే తప్ప ఏ కార్యకర్తకు గౌరవం దొరకదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో పనిచేసే ప్రతి కార్యకర్త ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, కాంగ్రస్‌లో ఉన్నన్ని రోజులు మనకు కష్టాలు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రజాసంక్షేమం, అభివృధ్దికాంక్షించే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. పార్టీ బలోపేతంతో పాటు రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.




