Tuesday, 3 November 2026

కాళేశ్వరంతో మారనున్న దశ

శరవేగంగా పూర్తవుతున్న పనులు
సస్యవిప్లవం దిశగా తెలంగాణ పరుగు
హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): వ్యవసాయరంగం పురోభివృద్దికి తీసుకుంటున్న చర్యలు తెలంగాణను వ్యవసాయికంగా ముందు నిలుపుతాయనడంలో సందేహం లేదు. ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి వనరులు అందుబాటులోకి రానున్నాయి. మూడు పంటలు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆగమేఘాల విూద పూర్తి చేస్తున్నారు. దానికి అనుబంధంగా ఉన్న ప్రాజెక్టులు, కాలువలు కూడా అదే స్పీడుతో సాగుతున్నాయి. మంత్రి హరీస్‌ రావు ఇందుకోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.  రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా మిగులకుండా మొత్తం వ్యవసాయ యోగ్య భూమికి సాగునీటి వసతికల్పించే
లక్ష్యంతో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ముఖ్యమంత్రి  కెసిఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఆయన దార్శనికతను ప్రతిబింబిస్తోంది. రాష్ట్రంలో రైతులు  భవిష్యత్‌లో వర్షానికి ఎదురుచూసే పరిస్థితి రాకుండా సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. తీసుకుంటున్న చర్యలు సాకారం అవుతున్న వేళ భవిష్యత్‌లో తెలంగాణ వ్యవసాయకంగా పురోగమించడం ఖాయంగా ఉంది. గోదావరి, కృష్ణమ్మ గలగలలు తెలంగాణ మెట్ట భూములను తడపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల చేపట్టిన ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలాగే హరితహారంతో కోట్లాది మొక్కలు నాటారు. మిషన్‌ కాకతీయతో చెరువులకు మహర్దశ పట్టింది. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచినీరు రాబోతున్నది. విద్యార్థుల కోసం గురుకులాలు పెట్టారు. గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ వంటివి చేశారు.ఒక్కో కార్యక్రమం ముందుకు సాగుతున్న తీరు చూస్తుంటే తెలంగాణ
పురోగమించడానికి ఎంతో దూరం లేదని అర్థం అవుతోంది.అనుకున్న ప్రాజెక్టులను అనుకున్నట్లుగా పూర్తి చేస్తున్న తీరు తెలంగాణ సంకల్పానికి నిదర్శనంగా నిలవనున్నాయి.  వచ్చే వర్షాకాలంనుంచే వీలైనంత ఎక్కువగా గోదావరి జలాలను తీసుకునేందుకు కావాల్సిన అన్ని పనులను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని సిఎం సూచించారు. ఇందుకోసం వాయువేగంతో పనులు జరుగాలని దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన వల్ల మరింత అవగాహన పెరిగిందన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాళేశ్వరం ఎత్తిపోతల పనులను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు పట్టుదలతో పనిచేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపుహౌస్‌లు అన్ని పూర్తికాగానే వచ్చే జూన్‌ నుంచి గోదావరి బేసిన్‌లోని అన్ని జిల్లాల్లో ఉన్న చెరువులు, కుంటలను యుద్ధ ప్రాతిపదికన నింపడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎక్కడా సాగునీరు అందని భూములను లేకుండా గోదావరి బేసిన్‌లోని నదులు, కాల్వలపై చెక్‌డ్యాంల ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలని అదేశించారు. మానేరు రివర్‌లో నాలుగు నుంచి ఐదు, మూలవాగు రివర్‌లో రెండు నుండి మూడు వరకు, ఇంకా అవసరం ఉన్న చోట చెక్‌ డ్యాంల నిర్మాణానికి ప్రణాళిక తయారుచేయాలన్నారు. దేవాదుల నుంచి వరంగల్‌ జిల్లా మొదలుకొని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు సాగునీటిని అందించాలన్నారు. వ్యవసాయం తరువాత అతిపెద్ద వ్యాపారంగా చేపల పెంపకం నిలుస్తుందని సీఎం అన్నారు.  జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో గోదావరిపై నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పనులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి  పరిశీలించి పరుగులు పెట్టిస్తున్నారు.  ఇందుకు కావాల్సిన అన్ని పనులను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకొని ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరదకాల్వ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎత్తిపోయాలని, మరో టీఎంసీ నీటిని మిడ్‌మానేరుకు తరలించడానికి కావాల్సిన పనులు పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా మిగులకుండా మొత్తం వ్యవసాయయోగ్య భూమికి సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఇక భవిష్యత్‌లో వర్షానికి ఎదురుచూసే పరిస్థితి లేకుండా సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మొత్తంగా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చూసే రోజులు దగ్గరపడ్డాయి.