కుక్కను హింసిస్తున్న యజమాని.

.కుక్కపిల్లలను పెంచుకునే  వారు    వాటిని     ఎంతో ప్రేమగా చూసుకుంటారు

మరి కొందరు మాత్రం సరిగా పట్టించుకోరు

కుక్కపిల్లలను పెంచుకునే కుటుంబాలు వాటిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. కానీ కొందరు మాత్రం సరిగా పట్టించుకోకుండా, ఆహారం పెట్టకుండా ఆ మూగజీవాలకు నరకం చూపిస్తుంటారు. అలా చేస్తున్న ఒక వ్యక్తికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఏకంగా బీజేపీ ఎంపీ, జంతు ప్రేమికురాలు మేనకా గాంధీ ద్వారా ఈ నిర్లక్ష్యపు యజమాని విషయం పోలీసులకు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖనిలోని దుర్గా నగర్ ఆర్కే గార్డెన్‌లో నివాసముంటున్న సాయి దీపక్ అనే వ్యక్తి ఇరవై రోజుల క్రితం ఒక ల్యాబ్ బ్రీడ్ కుక్కను తన స్నేహితుల వద్ద తీసుకొని పెంచుకుంటున్నాడు.కానీ దాన్ని సరిగ్గా చూసుకో పోయేసరికి కుక్క మెయిన్ రోడ్డు మీదకు వచ్చింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఒక వాహనం డీ కొట్టడంతో కుక్క కాలికి గాయం అయింది. కుక్క నడవలేని స్థితిలో ఉందని, సరిగ్గా తిండి పెట్టకుండా పదే పదే కొడుతూ దానిని యజమాని హింసిస్తున్నాడని అక్కడున్న స్థానికులు ఫోటోలు, వీడియోలు తీశారు. వీటిని మరో జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మీ గౌతమ్‌కు పంపించారు. వాటిని చూసిన ఆమె.. బీజేపీ ఎంపీ మేనక గాంధీకి వీటిని చేరవేశారు. ఈ వీడియోలు చూసిన మేనక గాంధీ.. కరీంనగర్ సిపి సత్యనారాయణకు సమాచారం అందించారు.దీంతో సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ సిఐ రమేష్ బాబు.. తమ బ్లూ కోట్స్ సిబ్బంది శ్రీకాంత్, ప్రవీణ్‌లను సాయి దీపక్ ఇంటికి పంపించారు. అక్కడ కుక్క దీన స్థితిలో ఉండటం గమనించిన సిబ్బంది.. సిఐ రమేష్ బాబుకు విషయం చెప్పారు. ఈ సమాచారాన్ని వెటర్నరీ డాక్టర్ రామ్ కిరణ్‌కు అందించిన సిఐ.. కుక్కకు చికిత్స అందించారు. అనంతర ‘హాండ్స్  సర్వ్’ ఫౌండేషన్ యానిమల్ రెస్క్యూ ప్రెసిడెంట్ అరవింద్ స్వామికి కుక్కను అప్పగించారు. కుక్కను కొనుక్కున్న సాయి దీపక్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలని హెచ్చరించారు.