Tuesday, 3 November 2026

కులాంతర వివాహాలకు పెరిగిన ప్రోత్సాహకం

50వేల నుంచి రెండున్నర లక్షల బహుమతి
హైదరాబాద్‌,డిసెంబర్‌14(జ‌నంసాక్షి): కులాంతర వివాహాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహక బహుమతని భారీగా పెంచి అందిస్తోంది. ఎస్సీలకు చెందిన యువతీ, యువకులను వివాహం చేసుకున్న వారికి నజరానా పెంచడం ద్వారా వీటిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాల్లో ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకాల అమలు బాధ్యతలను జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారులకు అప్పగించారు. గతంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ.50 వేల ప్రోత్సాహకం ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ.2.50 లక్షలకు పెంచారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు సమాజంలో పరిమాణాలను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎస్సీలకు బాసటగా నిలుస్తోంది. జంటకు రూ.2.50లక్షల ప్రోత్సాహక అవార్డును అందించనున్నారు. ఇందుకు సంబంధిత శాఖ అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. కులాంతర వివాహం చేసుకున్న జంటలు ప్రోత్సాహకం పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వధువు, లేదా వరుడు కులాంతర వివాహం చేసుకొని ఉండాలి. వధువు, వరుడు రూ.2లక్షలలోపు ఆదాయం కలిగి ఉండాలి. గత అక్టోబర్‌ 30 తర్వాత చేసుకున్న కులాంతర వివాహాలకు ఈ ఇన్సెంటివ్‌ అవార్డును అందించనున్నారు. కులాంతర వివాహ ప్రోత్సాహక అవార్డుకు ధ్రువీకరణ పత్రాలు తప్పని సరిగా జతపర్చాలి. ఇద్దరికీ సంబంధించిన ఆధార్‌కార్డులు జత చేయాలి.  వధూవరులు బ్యాంకులో జాయింట్‌ అకౌంట్‌ కలిగి ఉండాలి.  వధూవరుల కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి. వివాహం జరిగినట్లు రిజిస్టేష్రన్‌ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.  కులాంతర వివాహం చేసుకున్నట్లు సాక్షుల ఆధార్‌ కార్డులు సైతం జత చేయాలి.  వధూవరుల పూర్తి చిరునామాను పొందు పర్చాలి. వీటిని జోడించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ వివరా ఆధారంగా విచారణ చేసిన అనంతరం నజరానాను వారి జాయింట్‌ అకౌంట్‌లో జమచేసేలా మార్గదర్శకాలను రూపొందించారు.