నిధుల కోసం పోరాటం తప్పదని సూచన
విభజనతో వెనక్కి నెట్టారని ఆరెపణ
టిడిఎల్పీ సమావేశంలో బాబు
హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): నిధుల కేటాయింపులో ఎపికి తీరని అన్యాయం జిరగిందని ఎపి సిఎం చంద్రబాబు మరోమారు అసహనం వ్యక్తం చేశారు. పొరుగు రాష్టాల్రకు ధీటుగా కొత్త రాజధాని అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరామని అయితే కేంద్రం నుంచి అనుకున్నంత సానుకూలత రాలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఏపీ టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ తొలి ఏడాదిలో ఏపీకి రూ.17 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉండగా రూ.500 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని బాబు తెలిపారు. ఆంధప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర సాధారణ బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధకరమని బాబు మరోసారి పేర్కొన్నారు. రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కేంద్రం తగు నిధులు ఇవ్వలేదని అన్నారు.కేంద్ర బడ్జెట్ లో ఎపికి ప్రత్యేకంగా నిదులు కేటాయించకపోవడం నిరుత్సాహం కలిగించిందని ఆయన అన్నారు.ఆంధప్రదేశ్ హక్కుల కోసం పోరాడాలని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు సూచించారు. కేంద్రం నుంచి సాయంపై తనవంతు ప్రయత్నం తాను చేస్తున్నట్లు చెప్పారు. విభజన అనంతర పరిణామాలపై ప్రజల్లో అవగాహన ఉందన్న ఆయన కేంద్రాన్ని ఒప్పించి ముందుకు పోవాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు. విభజనపై రాజకీయ నిర్ణయం తీసుకున్నారని అయితే ఏ తప్పూ చేయని ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని బాబు పేర్కొన్నారు. పోలవరం ఆంధప్రదేశ్‌కు ప్రాణాధారంగా సీఎం అభివర్ణించారు. పోలవరం కోసం ఏ పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. రాయలసీమకు నీరు ఇస్తానంటే కొందరికి బాధగా ఉందని, వారి ఫ్యాక్షన్ రాజకీయంగా ఇక నడవదని బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఉభయగోదావరితో పాటు, అనంతపురం జిల్లాలే తన ప్రాధాన్యతలని ఆ జిల్లాలే టీడీపీని గెలిపించాయని బాబు అన్నారు. పట్టిసీమను బూచీగా చూపి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎర్రచందనం అమ్మకంతో రూ.3వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. బెరైటీస్ నుంచి రూ.1000 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్లు కేటాయిస్తే వంద ఏళ్లకు కూడా పూర్తి కాదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు అడిగితే.. కేంద్రం రూ.100 కోట్లు కేటాయించదన్నారు.ఆ మొత్తంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుందని కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ సంవత్సరం 30 శాతం వర్షపాత లోటు ఉన్నప్పటికీ వ్యవసాయంలో మంచి ప్రగతి సాధించమన్నారు. మిగులు జలాలను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలిస్తామన్నారు.ఏపీ రాజధానిని 2018 జూన్ లో ప్రారంభిస్తామని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అవసరమైతే ఎపి హక్కుల కోసం పోరాడాలని చంద్రబాబు చెప్పారు.ఎప్పుడూ మోడీని పొగుడుతూ ఉండే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనను విమర్శించడం లేదు కాని, తన అసహనాన్ని, అసంతృప్తిని పలు రూపాలలో వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్టాల్రకు ఇచ్చినట్లుగానే నిధులు ఇచ్చారని.. అన్ని రాష్టాల్రతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకూ కేంద్రం చేయూతినివ్వాలని చంద్రబాబు తెలిపారు. సింగపూర్ బృందం ఈ జూన్ లో మాస్టర్ ప్లాన్ ఇవ్వనుందని.. తర్వాత ఓ ఏజెన్సీ ద్వారా రాజధానిలో కేటాయింపులు జరుపుతామన్నారు. సోమవారం ఏపీ రాజధాని అంశంపై మాట్లాడిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణం ఆలస్యం చేయాలని కొందరు చూస్తున్నారన్నారు. ప్రస్తుతం విద్యుత్ పంపిణీ వ్యవస్థను సరిచేశామని.. ఆరు శాతం విద్యుత్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించామన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు అందించాలని పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టినట్లు బాబు తెలిపారు. ఆ క్రమంలోనే గోదావరి జిల్లాల సాగునీటికి ఇబ్బందికి కలగనివ్వమన్నారు. అసెంబ్లీలో అన్ని అంశాలపై స్పష్టంగా సమాధానం చెప్పాలని సభ్యులకు సూచించారు. మంత్రుల ఇంకా సబ్జెక్ట్ పై పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలందరూ బాగా స్టడీ చేయాలని బాబు తెలిపారు




